గరాసియా తెగ సాంప్రదాయంలో పిల్లలు పుట్టాక పెళ్లి!

Telugu Lo Computer
0


రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లోని గరాసియా తెగ సంప్రదాయం ప్రకారం యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకోవడానికి నిర్ణీత వ్యవధుల్లో రెండు రోజుల పాటు ఓ జాతర జరుగుతుంటుంది. ఇందులో భాగంగా తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకొని పెళ్లితో సంబంధం లేకుండా అతడితో సహజీవనం మొదలుపెట్టేయచ్చు. ఈ క్రమంలో అబ్బాయి కుటుంబ సభ్యులు కొంత సొమ్మును అమ్మాయి కుటుంబానికి అందించి వారితో సహజీవనం ప్రారంభింపజేస్తారు. ఇది ఒక విధంగా ఎదురుకట్నం అన్నమాట! ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఈ జంట వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలోనూ పెళ్లి ఖర్చులన్నీ వరుడి కుటుంబ సభ్యులే భరిస్తారట! పైగా వరుడి ఇంట్లోనే పెళ్లి వేడుకలన్నీ ఘనంగా నిర్వహించే ఆచారం ఇక్కడ దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి ఏళ్ల పాటు సహజీవనం చేసే ఆచారం ఈ తెగలో ఉంది. ఈ క్రమంలో పిల్లల్ని కనచ్చు. ఆ తర్వాత ఆర్థికంగా స్థిరపడి, ఏ లోటూ లేకుండా కుటుంబాన్ని పోషించగలమన్న ధీమా ఏర్పడ్డాకే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకోవచ్చట! ఈ పద్ధతిని 'దాపా'గా పిలుస్తున్నారు ఇక్కడి ప్రజలు. అంటే.. అనుబంధంలో పెళ్లిని అత్యవసరంగా కాకుండా నామ మాత్రంగా వ్యవహరిస్తారన్న విషయం ఇట్టే అర్థమవుతోంది. ఈ క్రమంలో పెరిగి పెద్దై సహజీవనం చేస్తోన్న తమ పిల్లలే వృద్ధ తల్లిదండ్రులకు పెళ్లి చేయడం కొన్ని కేసుల్లో మనం చూడచ్చు. పైగా సహజీవనంలో ఉన్న భాగస్వామి తమను వేధించినా, ఇకపై అతడితో కొనసాగలేమని నిర్ణయించుకున్నా.. ఈ బంధం నుంచి బయటికి వచ్చే వెసులుబాటును గరాసియా తెగ పూర్వీకులు ఇక్కడి మహిళలకు కల్పించారు. మొత్తానికి పెళ్లి విషయంలో ఇక్కడి స్త్రీలపై లేనిపోని ఆంక్షలు విధించకుండా.. పూర్తి స్వేచ్ఛ కల్పిస్తూ, వారి నిర్ణయాలను గౌరవిస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)