పాటియాలాలో ఉద్రిక్తత !

Telugu Lo Computer
0


పంజాబ్‌లోని పాటియాలాలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రెండు గ్రూపులు పరస్పరం రాళ్లు రువ్వుకొని, కత్తులు దూసుకున్నాయి. ఓ నిషేధిత గ్రూపునకు వ్యతిరేకంగా మరో గ్రూపు చేపట్టిన ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గుంపులను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికులంతా శాంతియుతంగా సామరస్యంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పాటియాలా పోలీస్‌ కమిషనర్‌ సాక్షి సాహ్ని ఓ ప్రకటన జారీ చేశారు. శాంతి, సామరస్యత అనేవి అన్ని మతాలకు, వాటి ప్రాథమిక ధర్మాలకు ప్రధానమైనవవన్నారు. ఒకవేళ ఏవైనా విభేదాలు, అపార్థాలు తలెత్తితే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ముఖ్యమని సూచించారు. పటియాలాకు చెందిన పౌరులంతా శాంతితో, సోదరభావంతో మెలగాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయనీ.. ఎప్పటికప్పుడు సమీక్షిస్తుననట్టు తెలిపారు. శాంతి, సామరస్యత నెలకొనేందుకు అన్ని చర్యలూ తీసుకొంటున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ స్పందించారు. ఇలాంటి ఘర్షణలు తలెత్తడం తీవ్ర దురదృష్టకరమన్నారు. డీజీపీతో మాట్లాడాననీ.. ఆ ప్రాంతంలో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణ జరిగినట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. పంజాబ్‌లో శాంతి, సామరస్యతే అత్యంత ప్రాధాన్యమన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)