ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఐదు రూపాయలకే భోజనం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 20 April 2022

ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఐదు రూపాయలకే భోజనం !


అనారోగ్యంతో ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సహాయకుల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. ఉచిత వైద్యం అందిస్తున్నప్పటికి రోగి బంధులకు భోజనం, టిఫిన్‌ ఖర్చులు భారంగా మారుతుండటంతో వాటిని కూడా ప్రభుత్వమే భరించి వారికి కొంత ఊరటనివ్వాలని భావించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర రోగుల సహాయకుల కోసం 5 రూపాయలకే రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని మూడు పూటలా అందించేందుకు తగిన కార్యాచరణను రూపొందించింది. తొలివిడతగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18ప్రధాన ఆసుపత్రుల దగ్గర ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తోంది. రోజుకు 55,800 భోజనాలను రోగుల సహాయకులకు అందించనుంది. పేద, మధ్యతరగతి రోగుల గురించి ఆలోచించిన ప్రభుత్వం 24.25 రూపాయల ఖర్చు అయ్యే భోజనం ఖరీదులో 19.25రూపాయల రాయితీని ప్రభుత్వం భరిస్తోంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 38.66కోట్ల అదనపు భారం పడనుంది. ఆర్ధికంగా వెనుకబడిన, పేదల సౌక్యం గురించి ఆలోచించిన ప్రభుత్వం ఈ తరహా సదుపాయం కోసం హరే కృష్ణ మూవ్‌మెంట్ స్వచ్చంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. పది రోజుల్లో ఈ 5 రూపాయల భోజనం సదుపాయం అందుబాటులోకి రానుంది. ఆసుపత్రుల్లో రోగి సహాయకుల కోసం 15రూపాయలకు మూడు పూటల రుచికరమైన భోజనం అందిస్తామని హరేకృష్ణ స్వచ్చంద సంస్థ సీఈవో కాంతేయదాస ప్రభు తెలిపారు. ఉదయం మెనులో పెరుగన్నం, పులిహోర, వెజిటెబుల్ పలావ్, సాంబార్‌ రైస్‌తో పాటు పచ్చడిని మార్నింగ్‌ టిఫిన్‌గా అందిస్తారు. ఇక మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో అన్నం, సాంబార్, లేదా పప్పు, పచ్చడి, కూరని రోగి బంధువులకు వడ్డిస్తామని మెనులో పేర్కొన్నారు. డిస్పోజల్ గ్లాస్, ప్లేట్‌తో పాటు చల్లని మంచినీరు కూడా సప్లై చేస్తారు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న హరేకృష్ణ స్వచ్చంద సంస్థ నిర్వాహకులు మొదటగా ఐదు రూపాయల భోజనాన్ని నగరంలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రితో పాటు గాంధీ, నిలోఫర్, సరోజినీదేవి,పేట్లబురుజు ప్రసూతి వైద్యశాల, ఎంఎన్‌జే, చెస్ట్ , ఈఎన్‌టీ, ఫీవర్ హాస్పిటల్స్‌తో పాటుగా సుల్తాన్‌బజార్, ప్రసూతి దవఖాన, నిమ్స్, టిమ్స్, కింగ్‌కోఠి, మలక్‌పేట, గోల్కొండ, వనస్థలిపురం, కొండాపూర్‌, నాంపల్లి ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న రోగి తాలుకు సహాయకులకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. రోగుల సహాయకులకు భోజనం విషయంలో ఎలాంటి రాజీ పడకుండా నాణ్యమైన ఆహారం అందించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ప్రకటించింది. ప్రస్తుతానికి గ్రేటర్‌ పరిధిలోని ఆసుపత్రుల్లో పది రోజుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. రానున్న రోజుల్లో క్రమంగా జిల్లాల్లో కూడా విస్తరింజేస్తామని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు.

1 comment:

  1. మంచి ఆలోచన.
    రోగులకు మెఱుగైన వైద్య సౌకర్యాలు అందించే కార్యక్రమం కూడా చేపడతారని ఆశిద్దాం.
    మంచిపనులు ఎవరుచేసినా అందరూ హర్షిస్తారు తప్పకుండా.

    ReplyDelete