రుయా అంబులెన్స్ ఘటనలు పునరావృతం కాకూడదు !

Telugu Lo Computer
0


దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కోవిడ్‌పై తాజా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర‍్యలపై ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ‍్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా పాల్గొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. అనంతరం వైద్య,ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కోవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అలాగే రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనలు తిరిగి పునరావృతం కాకూడదని ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలన్న సీఎం, ఆరోగ్యమిత్ర కియోస్క్‌ల వద్ద ఈ నంబర్లు స్పష్టంగా డిస్‌ప్లే అయ్యేలా చూడాలని ఆదేశినంచారు. 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ లాంటి వాహనాలమీద ఫిర్యాదు నంబర్లు కనిపించేలా ఉండాలన్నారు. దీనివల్ల ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా వెంటనే ఆ నంబర్లకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఒకటి, రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని, అలాంటి పరిస్థితి రాకూడదని సీఎం పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సమర్థవంతమైన ప్రోటోకాల్‌ ఉండాలని చెప్పారు. విజయవాడ ఆస్పత్రి లాంటి ఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు మరింత విజిలెంట్‌గా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలసత్వం వహించారనే ఆరోపణలపైనే సీఐ, ఎస్పైలపై చర్యలు తీసుకున్నారన్న సీఎం,ప్రభుత్వం అంటే.. మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం అన్నివేళలా మంచిచేయాలని చెప్పారు. దీని కోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్య, వైద్యం-ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)