త్రిపురలో విస్తరిస్తోన్న ఆఫ్రికన్ ఫీవర్ !

Telugu Lo Computer
0



త్రిపురలో ఆఫ్రికన్ ఫీవర్ విస్తరించింది. సెపహిజల జిల్లాలోని దేవీపూర్‌లో ప్రభుత్వం నిర్వహిస్తోన్న పిగ్ బ్రీడింగ్ ఫామ్‌లో ఈ ఫీవర్ వెలుగులోకి వచ్చింది. కొన్ని పందుల నమూనాలను పరీక్షించిన అనంతరం పశు సంవర్ధక శాఖ అధికారులు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకినట్లు నిర్ధారించారు. తొలిదశలో మూడు పందుల్లో ఫీవర్ లక్షణాలు కనిపించాయని, మిగిలిన వాటికి కూడా సోకి ఉంటాయని అంచనా వేసినట్లు చెప్పారు. పందుల నుంచి మనుషులకు విస్తరించే ప్రమాదం ఉన్నందున- బ్రీడింగ్ ఫామ్‌లో పని చేసే సిబ్బంది, కార్మికులకు పీసీఆర్ పరీక్షలను నిర్వహించినట్లు ప్రభుత్వ లాబొరేటరీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ మృనాల్ దత్త తెలిపారు. స్వైన్ ఫీవర్ బారిన పడిన పందులన్నింటినీ సామూహికంగా ఖననం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. బ్రీడింగ్ ఫామ్‌కు చదరపు కిలోమీటర్ పరిధిలో ఉన్న పందులన్నింటినీ ఖననం చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్‌కు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌కు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఏడీ) స్పష్టం చేసినప్పటికీ అప్రమత్తంగా ఉండక తప్పదని మృనాల్ దత్త చెప్పారు. ఫీవర్ బారిన పడిన పందులన్నీ మరణించాయని, వాటిని సంరక్షించడానికి అసవరమైన వ్యాక్సిన్ ప్రస్తుతానికి అందుబాటులో లేదని అన్నారు. దీన్ని విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)