రాగల ఐదు రోజులలో ఐదు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు !

Telugu Lo Computer
0


దేశంలోని అధిక ప్రాంతాల్లో 45 డిగ్రీ సెల్సియస్‌పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర ఎండల కారణంగా రానున్న ఐదు రోజుల్లో కనీసం ఐదు రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులకు అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు ఐఎండీ ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే ఉంటాయని తెలిపింది. మే నెల మొదటివారం వరకు ఎండలు ఇలానే ఉంటాయి. ఆ తర్వాత వర్షాలకు అవకాశాలున్నాయని ఐఎండీ శాస్త్రవేత్త ఆర్‌కే జెనమణి పేర్కొన్నారు. ఇక మధ్యభారతదేశ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలోనూ 45 డిగ్రీ సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. కాగా దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం గరిష్ఠంగా 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. శుక్రవారం 45 డిగ్రీల సెల్సియస్ మార్క్‌ను తాకే అవకాశముందన్నారు. రానున్న ఐదు రోజుల్లోనూ ఇవే తీవ్ర ఉష్ణోగ్రత పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల్లో వాయువ్య భారతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే సూచనలున్నాయని ఐఎండీ తెలిపింది. ఆ తర్వాత ఓ రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుదలకు అవకాశం ఉందని పేర్కొంది. ఒకవైపు ఎండలతో అల్లాడుతున్న జనాలను కరెంట్ కోతలు భయపెడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలకు కూడా కరెంట్ కోతలు విధిస్తున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ లాంటి ఎడాది రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరెంట్ కోతలు అక్కడి వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)