ఏసీ వాడకందారులకు బాదుడు!

Telugu Lo Computer
0


వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఒకటే ఉక్కపోత. ఫ్యాను గాలి మరింత వేడిని పంచుతోంది. తట్టుకోలేని జనం ఏసీలవైపు పరుగులు తీస్తున్నారు. జనాన్ని బాదడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని కూడా డబ్బు చేసుకోవడానికి పూనుకుంది. కొత్తగా ఏసీ బిగించుకుంటే చాలు నాలుగు వేలు కక్కమంటూ నోటీసులు ఇచ్చి దబాయించి వసూలు చేస్తోంది. తిరుపతి విద్యుత్‌ సర్కిల్‌ పరిధిలో జనాన్ని అదనపు వాడకం పేరుతో బాదేస్తున్నారు. ఇప్పుడు మధ్యతరగతికి కూడా ఏసీ అనివార్య అవసరం అయిపోయింది. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు ఉక్కపోతతో సతమతమవుతుండడంతో అప్పో సప్పో చేసి, నెలసరి వాయిదాల మీద అయినా ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. తిరుపతి నగరంలో ఏసీలు విక్రయించే ప్రధాన ఏజెన్సీలు పది దాకా వుండగా రిటైల్‌ దుకాణాలు 50 వరకూ వున్నాయి. ఒక్క ఏజెన్సీలోనే గత నెలలో 900 ఏసీలు, ఈ నెలలో 700 ఏసీలు అమ్ముడయ్యాయి. ఆ లెక్కన తిరుపతి విద్యుత్‌ శాఖ సర్కిల్‌ పరిధిలో గత నెల, ఈ నెల కలిపి సుమారు 50 వేల ఏసీలు అమ్ముడయ్యాయని అంచనా. సగటున ఏసీ ధరలు రూ. 30 వేల నుంచీ రూ. 80 వేల దాకా వుంటున్నాయి. ప్రారంభ ధరే తీసుకున్నా ఏసీ కొనుగోలు కోసం వినియోగదారుడు కనీసమంటే రూ. 30 వేలు ఖర్చు చేయాల్సివస్తోంది. ఏసీ ఉన్నాక నెలవారీ కరెంటు బిల్లులు పెరుగుతాయి. అయిదు వందలు దాటని బిల్లులు చెల్లించేవారు కూడా నెలకు రూ. వెయ్యి నుంచీ రూ. 2 వేలు చెల్లించక తప్పదు. వేసవిలో మూడు నెలల పాటు తప్పనిసరై ఈ అదనపు భారాన్ని భరించేందుకు సిద్ధపడుతున్నారు. అయితే విద్యుత్‌ శాఖ అధికారులు అంతకు మించిన బాదుడుతో వినియోగదారులకు షాక్‌ ఇస్తున్నారు. సాధారణంగా విద్యుత్‌ సర్వీసు కనెక్షన్‌ తీసుకునే సమయంలో వినియోగదారులు తమ ఇంటికి అవసరమైన సామర్ధ్యానికి డిపాజిట్‌ చెల్లించి కనెక్షన్‌ పొందడం జరుగుతుంటుంది. తర్వాత కుటుంబ అవసరాలు, ఆర్థిక స్థోమత పెరిగే కొద్దీ అదనపు పరికరాలు కొంటారు. దీంతో కరెంటు వినియోగం పెరుగుతుంది. తీసుకున్న కనెక్షన్‌ స్థాయికి మించి విద్యుత్‌ వాడకం జరుగుతుంది. ఇక్కడి నుంచే బాదుడు మొదలవుతుంది. తొలుత కనెక్షన్‌ తీసుకున్న సమయంలో పేర్కొన్న కెపాసిటీకి మించి విద్యుత్‌ వాడడంతో కిలోవాట్‌కు అదనంగా డెవల్‌పమెంట్‌ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్లు, అప్లికేషన్‌ ఫీజు, సూపర్‌విజన్‌ ఛార్జీలు, ఎస్‌జీఎస్టీ, సీజీఎస్టీ తదితరాల పేరిట మొత్తంగా రూ. 1800 వరకూ చెల్లించాల్సి వుంటుంది. ఏసీ ఉపయోగిస్తే నెలకు అదనంగా రెండు కిలోవాట్ల విద్యుత్‌ వాడకం వుంటుంది. దీంతో కొత్తగా ఏసీలు ఉపయోగిస్తున్న వారిని అదనపు మొత్తాలు చెల్లించమంటూ విద్యుత్‌శాఖ నోటీసులు పంపుతోంది. గడువులోగా చెల్లించకుంటే కనెక్షన్‌ తొలగిస్తామన్న హెచ్చరికలు నోటీసులో వుంటున్నాయి. సగటున చూస్తే ఏసీలు కొని నెల పాటు వాడిన వారందరికీ కనీసమంటే రూ. 4 వేలు చెల్లించాలని నోటీసులు జారీ అవుతున్నాయి. వినియోగదారులు ఈ నోటీసులు చూసి బెంబేలెత్తిపోతున్నారు. వేసవిలో జగనన్న ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక కానుక ఇది అంటూ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)