ఆంధ్రప్రదేశ్ సర్కారు స్కూళ్లల్లో సీబీఎస్‌ఈ

Telugu Lo Computer
0


నూతన విద్యావిధానం అమలులో భాగంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఒకే పాఠశాలలో విద్యాబోధన జరిగేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ విధానం అమలులో భాగంగా సీబీఎస్‌ఈ సిలబస్‌తో కొన్ని పాఠశాలలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇది అమలైతే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో చేరే అవకాశం ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధనకు జిల్లాలో 28 పాఠశాలలను విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో 27 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, ఒకటి ప్రభుత్వ యాజమాన్య పాఠశాల ఉంది. పాఠశాలలు, వాటి యునిక్‌ ఐడీ నెంబరు తదితర వివరాలను విద్యాశాఖ కమిషనర్‌కు ఆదివారం పంపారు. అవనిగడ్డ ప్రభుత్వ పాఠశాలతోపాటు, ఆగిరిపల్లి, బాపులపాడు, చందర్లపాడు, చాట్రాయి, గన్నవరం, దావాజీగూడెం, కౌతవరం, మల్లవోలు, మూలపాడు, కొండపల్లి, కలిదిండి, మారుతెగళ్లపాడు, కంచికచర్ల, ఈడుపుగల్లు, మొవ్వ, చెక్కపల్లి, ఉంగుటూరు మండలంలోని మణికొండ, మైలవరం మండలంలోని చండ్రగూడెం, నాగాయలంక, నూజివీడు, పామర్రు, తిరువూరు, వత్సవాయి, నిడమానూరు, నున్న, ఉయ్యూరు జిల్లాపరిషత్‌ పాఠశాలలున్నాయి. మండలానికి రెండు జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకనుగుణంగా విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు సేకరించింది. ఒకటి కో-ఎడ్యుకేషన్‌, మరొకటి బాలికల కోసం ప్రత్యేక జూనియర్‌ కళాశాలను ఏర్పాటుచేసే దిశగా అడుగులు పడుతున్నాయి. జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తే అదనపు తరగతి గదులు, అధ్యాపకుల అవసరం ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌తో నడిచే పాఠశాలల్లో అదనపు సౌకర్యాలు కల్పించకుండా అధికారులు పాఠశాలలను గుర్తించడంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పాఠశాలల ఆవరణ, అందుబాటులో ఉన్న తరగతి గదులు, ఇంగ్లీష్‌, తెలుగు మాధ్యమాల్లో ఉన్న తరగతుల వివరాలను విద్యాశాఖ కమిషనర్‌కు పంపారు. ప్రధానోపాధ్యాయుని గది, స్టాఫ్‌ రూమ్‌, స్టోర్‌ రూమ్‌, లైబ్రరీ, ల్యాబరేటరీ, కంప్యూటర్‌ ల్యాబ్‌ ఉన్న పాఠశాలలకే ప్రాధాన్యతనిచ్చారు.


Post a Comment

0Comments

Post a Comment (0)