విప్లవానికి ఉరివేసిన రోజు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 22 March 2022

విప్లవానికి ఉరివేసిన రోజు

 

ఆ ముగ్గురు విప్లవానికి నిలువుటద్దంగా నిలిచారు. బ్రిటిష్ దుర్మార్గపు పాలనలో చిక్కుకున్న భారత దేశానికి విముక్తి కలిగించేలా దేశ ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని నింపి..భారత స్వాతంత్ర్యోద్యమాన్ని మరో మెట్టు ఎక్కించారు. మన స్వాతంత్య్రం మన చేతుల్లోనే ఉందని భావించిన ఆ ముగ్గురు బ్రిటిష్ అధికారులపై తిరగబడ్డారు. ఆ ముగ్గురిలో దేశ ప్రజల్లో పోరాట స్ఫూర్తి జ్వలను రగిలించే శక్తిని గ్రహించిన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ పోరాటాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది. స్వాతంత్రోద్యమ తీవ్రవాదులుగా పేర్కొంటూ ముగ్గుర్ని ఒకేసారి ఉరి తీసింది బ్రిటిష్ ప్రభుత్వం. 1931 మార్చి 23న భారత స్వాతంత్ర విప్లవకారులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసింది. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో అత్యంత సంచలనంగా మారిన ఈఘటనలో బ్రిటిష్ అధికారుల రాక్షసత్వం ఈ ముగ్గురిని ఉరితీయడంతోనే ఆగిపోలేదు. ఉరి అనంతరం..భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి, సంచుల్లో కుక్కి, కాల్చి బూడిద చేయాలనీ ప్రయత్నించారు. 1928లో బ్రిటిష్ పోలీస్ అధికారి శాండర్స్ ను హత్య చేసిన ఘటనలో భగత్ సింగ్ ను అరెస్ట్ చేసిన బ్రిటిష్ అధికారులు..ఆ ఘటనతో పాటు..ఉద్యమ సమయంలో పలు నేరాల్లో దోషులుగా తేలిన శివరాం రాజ్ గురు, సుఖ్ దేవ్ థాపర్ లకు జైలు శిక్ష విధించింది. అయితే దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్న వీరి అరెస్టులు దేశ ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు రేకెత్తించడంతో పాటు బ్రిటిష్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి కూడా వచ్చింది. ముగ్గురు విప్లవకారులను అరెస్ట్ చేసినా స్వాతంత్ర పోరాటం ఆగలేదు సరికదా.. బ్రిటిష్ పాలకులపై ప్రజలు తిరగబడడం ప్రారంభించారు. ప్రజల్లో భయం కలిగించేలా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరి తీయాలని అప్పటి బ్రిటిష్ రాజ్ ప్రభుత్వం భావించింది. దీంతో 1931 మార్చి 24న లాహోర్ జైల్లో వీరిని ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేయగా..అప్పటికే దేశ ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని అంచనా వేసిన బ్రిటిష్ ప్రభుత్వం పగటి పూట ముగ్గురు విప్లవకారులను ఉరితీసే సాహసం చేయలేకపోయింది. అయితే దేశ ప్రజలంతా నిద్రిస్తున్న సమయంలో గుట్టుచప్పుడు కాకుండా అనుకున్న సమయం కంటే ఒకరోజు ముందే అంటే 1931 మార్చి 23న రాత్రి 7.30 గంటలకు విప్లవకారులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. అయితే ఉరి విషయం తెలిస్తే దేశ ప్రజల్లో మరింత ఆగ్రహ జ్వాలలు రేకెత్తించి, బ్రిటిష్ పాలనపై మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భయపడిన అప్పటి అధికారులు.. తెల్లవారే లోపే..ముగ్గురి మృతదేహాలను మాయం చేయాలనీ భావించారు. బ్రిటిష్ అధికారులు..అత్యంత పాశవికంగా ఈ ముగ్గురు పోరాట యోధుల మృతదేహాలను ముక్కలుగా నరికి, సంచుల్లో నింపి రాత్రికి రాత్రే ఖననం చేయాలని ఏర్పాట్లు చేశారు. అయితే జైలు నుంచి మృతదేహాలు కుక్కిన సంచులను తరలించేందుకు చాలా సమయం పట్టింది. దీంతో మార్చి 24 తెల్లవారుజామున లాహోర్ సమీపంలోని సట్లెజ్ నదీ తీరంలో కసూర్ గ్రామ సమీపంలో ముగ్గురి అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మార్చి 24 తెల్లవారు జామున చీకటిలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ మృతదేహాల భాగాలను చితిపై పేర్చి, వారి వారి సాంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియాలు నిర్వహిస్తుండగా..సమీప గ్రామాల ప్రజలు ఆ చితిమంటలను గమనించి అక్కడికి చేరుకున్నారు. ప్రజలు అక్కడికి వస్తే తమ గతి ఏమౌనో అని భావించిన బ్రిటిష్ అధికారులు..చితిపై కాలుతున్న మృతదేహాలను నదిలో విసిరేసి..అక్కడి నుంచి పారిపోయారు. మూడు చితుల ఆనవాళ్లను చూసి అది భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లుగా నిర్ధారించుకున్న గ్రామస్తులు.. నదిలో పడేసిన మృతదేహాల భాగాలను తిరిగి చితిపై పేర్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇక మార్చి 24 ఉదయానికి ఈ విషయం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారగా.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజల్లో తీవ్ర ఆగ్రవేశాలు రేకెత్తించింది.


No comments:

Post a Comment