గ్యాస్‌ ట్రబుల్‌ అని వస్తే ప్రాణం పోయింది!

Telugu Lo Computer
0


తెలంగాణ లోని మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన చెన్న వెంకటేశ్‌ (30) కొంతకాలంగా గ్యాస్‌ ట్రబుల్‌తో బాధపడుతున్నాడు. శనివారం సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో రాత్రి 8 గంటలకు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్షలు చేసి ప్రధాన సమస్య ఏమీ లేదని తెలిపారు. ఒక రోజు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించి అడ్మిట్‌ చేసుకున్నారు. రాత్రంత వైద్యం అందించారు. ఆదివారం ఉదయం బాగానే ఉన్నాడు. మరోసారి పరీక్షించిన వైద్యులు ఇంటికి వెళ్లొచ్చని తెలిపారు. గంట తర్వాత డిశ్చార్జి చేస్తామని చెప్పారు. ఇంతలో వెంకటేశ్‌కు ఫిట్స్‌తో పాటు, గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వైద్యులు చికిత్స అందించే లోపే మృతి చెందాడు. వెంకటేశ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటేశ్‌ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. వైద్యం పేరిట ప్రయోగాలు చేశారని, మందులు ఓవర్‌ డోస్‌ ఇవ్వడంతోనే మృతిచెందాడని ఆరోపించారు. వెంకటేశ్‌ మృతికి కారణమైన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఉద్రిక్త వాతారవణం నెలకొంది. సమాచారం అందుకున్న సీఐ నారాయణ్‌ నాయక్, ఎస్సై ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. బాధితులతో మాట్లాడారు. రాతపూర్వకంగా ఫిర్యా దు చేస్తే చర్య తీసుకుంటామని తెలిపారు. తర్వాత బాదితుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపినట్లు తెలిసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, వెంకటేశ్‌ మృతిపై తమకు ఫిర్యాదు అందలేదని సీఐ నారాయణ్‌ నాయక్‌ తెలిపారు. ఈ విషయమై ఆస్పత్రి వైద్యుడు శ్రావణ్‌ను వివరణ కోరగా వెంకటేశ్‌ బాత్‌ రూమ్‌కు వెళ్లి వస్తుండగా ఫిట్స్, హార్ట్‌స్ట్రోక్‌తో కుప్పకూలాడని తెలిపారు. తాము అందించిన చికిత్సలో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)