కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయం!

Telugu Lo Computer
0


బెంగళూరు లోని  ప్యాలెస్‌ గ్రౌండ్స్‌లో ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఎంబీ పాటిల్‌ ఆడంబరంగా బాధ్యతలు చేపట్టారు. నెలరోజుల క్రితమే కమిటీ అధ్యక్షుడిగా నియమించినా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రతిపక్షనేత సిద్దరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్ సింగ్‌ సుర్జేవాలాతోపాటు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణదీప్ సింగ్‌ మాట్లాడుతూ సీఎం బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. 40 శాతం కమీషన్‌ లేనిదే పనులు సాగడం లేదన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ హైకమాండ్‌ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఎంబీ పాటిల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 150 స్థానాలలో గెలుపొంది కాంగ్రెస్‌ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ వారు ఎవరూ పాల్గొనలేదని కానీ దేశభక్తి గురించి కాంగ్రెస్ కు చెప్పేందుకు వచ్చారన్నారు. కొవిడ్‌ నిర్వహణలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. కొవిడ్‌ పేరిట వేల కోట్ల రూపాయలు లూటీ చేశారన్నారు. డీకే శివకుమార్‌ మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే దేశ ప్రగతి సాధ్యమన్నారు. బీజేపీవారు హిందూత్వమంటారని, కానీ కాంగ్రెస్‌ హిందూ, ముస్లిం, సిక్‌, క్రైస్తవులందరినీ సమానంగా చూస్తుందన్నారు. కాంగ్రెస్ లో అన్ని మతాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని, ఇదే పార్టీకి శక్తి అన్నారు. ప్రతిపక్షనేత సిద్దరామయ్య మాట్లాడుతూ బీజేపీ ఓ అజెండాతో ముందుకెళుతోందని, అందరూ సమానమనే విధానం పాటించడం లేదన్నారు. సమాఖ్య భారత్‌లో ఇటువంటి విధానం సరికాదన్నారు. ప్రచార సమితి బాధ్యతలను ముఖ్యనేతలు ఎంబీ పాటిల్‌కు అప్పగించారు. మాజీ మం త్రులు, వివిధ రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)