కుప్పకూలిన క్వారీ

Telugu Lo Computer
0


కర్ణాటకలోని గుమ్మకల్లు హిల్ క్వారీ కుప్పకూలిన దుర్ఘటనలో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఒక కార్మికుడి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటన నేపథ్యంలో చామ్‌రాజ్‌నగర్ జిల్లాలో మైనింగ్ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్టు ఆ జిల్లా ఇన్‌చార్జి, హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ మంత్రి వి.సోమన్న ప్రకటించారు. వైట్ స్టోన్ హిల్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్టు, ఆ ఏరియాలో మైనింగ్ పనుల కోసం జారీ చేసిన లైసెన్స్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు కూడా ప్రకటించారు. క్వారీ ప్రమాదం ఘటనకు సంబంధించిన కేసులో మైనింగ్ కోసం ఈ భూమిని లీజ్‌కు ఇచ్చిన ల్యాండ్ ఓనర్ మహేంద్రప్ప, క్వారీ మేనేజర్ నవీద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ల్యాండ్ డీల్ చట్టబద్ధతను నిర్ధారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మహేంద్రప్ప, నవీద్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని మంత్రి సోమన్న తెలిపారు. బండల కింద చిక్కుకుపోయి శవమై తేలిన వ్యక్తిని సర్ఫరాజ్‌గా గుర్తించినట్టు చెప్పారు. చామ్‌రాజ్‌నగర్ జిల్లా గుండ్లుపేట్ సమీపంలోని కేవ్‌లో పలువురు పశ్చిమబెంగాల్‌కు చెందిన కార్మికులు చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు. గుహలోపల మైనింగ్ వర్కర్లు పనిచేస్తుండగా శుక్రవారంనాడు క్వారీ కుప్పకూలింది. దీంతో వైట్ స్టోన్‌కు చెందిన పెద్ద పెద్ద బండలు కిందపడి టిప్పర్ ట్రక్కులు, ఇతర వాహనాలను ఢీకొనడంతో అవి తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలువురు కార్మికులు బండల కింద నలిగిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఎన్‌డీఆర్ఎఫ్, రాష్ట్ర అగ్నిమాపక దళం, అత్యవసర సర్వీసుల సిబ్బంది సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. సుమారు 75 మంది సహాయక పనుల్లో నిమగ్నం కాగా, ఇంతవరకూ ఒక వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)