రష్యా నుంచి భారీగా సన్ ఫ్లవర్ ఆయిల్ కొనుగోలు

Telugu Lo Computer
0


ప్రపంచంలో అత్యధికంగా వంటనూనెలు దిగుమతి చేసుకునే దేశంగా భారత్ కు పేరుంది. అయితే వంట నూనెల దిగుమతి విషయంలో కొన్నాళ్లుగా భారత్ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మలేషియా, ఇండోనేషియా దేశాలు పామాయిల్, సోయా ఆయిల్ ఎగుమతులు తగ్గించేయడంతో భారత మార్కెట్లు దెబ్బతిన్నాయి. వీటికితోడు రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ నుంచి వచ్చే సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు కూడా రావడం లేదు. భారత్‌ కు అత్యధికంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎగుమతి చేసే దేశాలైన రష్యా, ఉక్రెయినే. అయితే ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి దిగుమతులు ఆగిపోవడంతో రష్యా వైపు భారత్ చూస్తోంది. భారత్‌ లో వంటనూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత సమయంలో రష్యా నుంచి భారీగా సన్‌ ఫ్లవర్ ఆయిల్ దిగుమతికి భారత కంపెనీలు సిద్ధమయ్యాయి. తాజాగా రష్యా నుంచి 45 వేల టన్నుల సన్‌ ఫ్లవర్ ఆయిల్‌ దిగుమతికి భారత్ ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ షిప్‌ మెంట్ వచ్చే నెలలో భారత్‌ కు చేరుతుందని సమాచారం. టన్ను సన్‌ ఫ్లవర్ ఆయిల్‌ ను 2,150 డాలర్లకు భారత్ కొనుగోలు చేస్తోంది. ఇది రికార్డు ధర. ఎందుకంటే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముందు ఈ ధర కేవలం 1,630 డాలర్లుగానే ఉండేది. గత నెల రోజులుగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం కుదరలేదని, కానీ ఇప్పుడు దిగుమతులకు కూడా లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌సీ)లు లభిస్తున్న తరుణంలో మళ్లీ రష్యా నుంచి కొనుగోళ్లు ప్రారంభించారని దిగుమతి వ్యాపారులు చెబుతున్నారు. వంట నూనెలకు ఉన్న డిమాండ్‌తో ధరలు భారీగా పెరగడంతో ఈ ప్రభావం అల్పాహార ధరలపై పడింది. వంట నూనెలతో తయారయ్యే అన్ని రకాల టిఫిన్‌ ధరలను హోటళ్ల యాజమాన్యాలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. నూనెతో తయారయ్యే దోశె, పూరి, వడ, బజ్జి, పుణుకులు వంటివాటి ధరలు ఇప్పటికే రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా పెరిగాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)