స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ క్లీన్ స్వీప్

Telugu Lo Computer
0


బెంగాల్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం కనబర్చింది. ఎన్నికలు జరిగిన 108 మున్సిపాలిటీలలో 102 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 77 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని బంగాల్​లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన భాజపా ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోలేకోయింది. కాంగ్రెస్ కు సైతం ఒక్క సీటు దక్కలేదు. 27మున్సిపాలిటీలలో విపక్షాలు అసలు ఖాతాలే తెరవలేదు. మున్సిపాలిటీల లోని అన్ని వార్డులను అధికార టీఎంసీ గెలుచుకుంది. భాజపా నేత సువేందు అధికారి కంచుకోట అయిన కంతి మున్సిపాలిటీ పైనా టీఎంసీ జెండా ఎగిరింది. గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ సువేందు అధికారి కుటుంబమే అధికారం చెలాయిస్తోంది. ఈ ఫలితం సువేందు పట్టుకు గట్టి షాక్ గా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక, మమతను దెబ్బ తీయాలని భావిస్తున్న బీజేపీ కనీస పోటీ ఇవ్వలేక పోయింది. కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇదే సమయంలో ఓ సరికొత్త రాజకీయ పార్టీ అనూహ్య ఫలితాన్ని సాధించింది. కొత్తగా ఏర్పాటైన హమ్రో పార్టీ డార్జీలింగ్ మున్సిపాలిటీని దక్కించుకుంది. 'గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్' మాజీ నేత, స్థానిక రెస్టారెంట్ యజమాని అజోయ్ ఎడ్వర్డ్స్ ఈ పార్టీని స్థాపించారు. డార్జీలింగ్​లో ఆధిపత్యం సాగించే గూర్ఖా జన్ముక్తి మోర్చా, టీఎంసీ, భాజపాలను ఓడించి.. మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు.సీపీఎం ఆధ్వర్యంలోని వామపక్ష కూటమి తహెర్పుర్ మున్సిపాలిటీలో విజయం సాధించింది. మిగిలిన నాలుగు మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు. ఇక్కడి ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు ఎవరికి దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)