పరిపాలన వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాము !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణపై జరిగిన చర్చ సందర్భంగా రాజధాని అమరావతిపై తనకు ప్రేమ ఉందని.. ప్రేమ ఉంది కాబట్టే అమరావతిలో తాను ఇల్లు కట్టుకున్నానని, న్యాయ రాజధానిగా అమరావతి కొనసాగాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థలు దేనికవే ప్రత్యేకమైనవని జగన్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకు ఉంటుందన్నారు. నెల రోజుల్లో రూ.లక్ష కోట్లతో రాజధాని కట్టేయాలని కోర్టులెలా చెప్తాయని జగన్ ప్రశ్నించారు. అమరావతిలో రోడ్లు, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాల కోసమే రూ.లక్ష కోట్లు ఖర్చవుతాయని గత ప్రభుత్వమే లెక్కలు కట్టిందని, ఇంకా బిల్డింగ్ వంటి కట్టడాలకు ఎంత ఖర్చు అవుతుందో ఊహకే అందడం లేదని జగన్ అన్నారు. పెరిగిన ధరలను పరిశీలనకు తీసుకుంటే రాజధాని నిర్మాణానికి 40 ఏళ్లు పడుతుందన్నారు. హైదరాబాద్ లాంటి రాజధానులు కట్టాలంటే కేవలం ఐదేళ్లు, 20 ఏళ్లు సరిపోవని కొన్ని వందల ఏళ్లు పడుతుందని జగన్ అన్నారు. గత ప్రభుత్వం రాజధానిని కేవలం గ్రాఫిక్స్‌కే పరిమితం చేసిందని జగన్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలు నచ్చలేదు కాబట్టే ప్రజలు తమకు ఘన విజయం అందించారని జగన్ పేర్కొన్నారు. శాసనసభ ఓ చట్టాన్ని చేయాలా వద్దా అని కోర్టులు నిర్ణయించలేవన్నారు. వికేంద్రీకరణ వల్ల ఏపీ అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీనే చెప్పిందని తెలిపారు. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చామన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)