25 కోట్లకు విక్రయించేందుకు పెగాసస్ ఆఫర్ : మమతా

Telugu Lo Computer
0


ఇజ్రాయెలీ సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ, ఎన్ఎస్ఓ  గ్రూప్, స్పైవేర్ పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను రూ. 25 కోట్లకు విక్రయించేందుకు నాలుగు ఐదేళ్ల క్రితం తమకు ఆఫర్ ఇచ్చిందని మమత బయటపెట్టారు. అప్పట్లో బెంగాల్ రాష్ట్ర పోలీసు విభాగానికి ఈ ఆఫర్ వస్తే తాము నిరాకరించినట్టు మమత వెల్లడించారు. స్పైవేర్‌ను రాజకీయంగా ఉపయోగించుకోవడం, న్యాయమూర్తులు, అధికారులను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని, అప్పుడే ఇజ్రాయెల్ పెగాసస్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు మమతా స్పష్టంచేశారు. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, ఇతరుల ఫోన్‌లను లక్ష్యంగా మిలిటరీ గ్రేడ్ ఇజ్రాయెలీ స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఆమె డిమాండ్‌ చేశారు. గత ఏడాది దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్నూపింగ్ వివాదంపై బెంగాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. వివాదాస్పద పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కొనుగోలు చేశారంటూ మమతా బెంగాల్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలతో రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.

మమతా వ్యాఖ్యలకు లోకేశ్ ఖండన 

అప్పట్లో చంద్రబాబు ఈ పెగాసస్ స్పైవేర్ నిజంగానే కొనుగోలు చేశారా లేదా అనేది చర్చ జరుగుతోంది. మమత వ్యాఖ్యలపై చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. పెగాసస్ కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అప్పట్లో తమకు కూడా పెగాసస్ క్రియేట్ చేసిన వారి నుంచి ఆఫర్ వచ్చిందన్నారు. కానీ తాము దాన్ని తిరస్కరించామని లోకేశ్ స్పష్టం చేశారు. చట్టానికి విరుద్ధంగా తాము ఎలాంటి పనులు చేయమన్నారు. ఆమెకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని అన్నారు. ఆ సమాచారం ఆధారంగానే ఆమె అలా అని ఉండొచ్చని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ నిజంగా పెగాసస్ కొనుగోలు చేసి ఉంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టకుండా ఉంటుందా అని లోకేశ్ ప్రశ్నించారు. ఇజ్రాయెల్‌కు చెందిన NSO Group అనే సంస్థ ఈ పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్‌ను క్రియేట్ చేసింది. ఈ స్పైవేర్ ద్వారా వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పెగాసస్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా దుమారాన్ని రేపింది. భారత్‌లోనూ పెగాసస్ రాజకీయ వివాదాలకు దారితీసింది. పెగాసస్ స్పైవేర్ ద్వారా దేశంలోని 300 మంది ప్రముఖులపై చట్టవ్యతిరేక నిఘా కొనసాగుతోందంటూ కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)