జిల్లా ఆస్పత్రుల్లోనూ కీమో, రేడియోథెరపీ

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ప్రతి జిల్లా ఆస్పత్రిలోనూ కిమోథెరపీ, రేడియో థెరపీ సదుపాయం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు. ఆయా చికిత్సల కోసం ప్రతిసారీ కేన్సర్‌ బాధితులు ఎంఎన్‌జే ఆస్పత్రి వరకూ రావాల్సిన ఇబ్బంది తప్పుతుందని ఆయన తెలిపారు. ఒకటి లేదా రెండు సైకిల్స్‌ మినహా ఎక్కడికక్కడే రోగులు థెరపీ చేయించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడి ఎంఎన్‌జే కేన్సర్‌ సంస్థలో రూ. 7.16 కోట్లతో ఏర్పాటు చేసిన 128 స్లైడ్స్‌ సీటీ స్కాన్‌ నూతన యంత్రం, కేన్సర్‌ స్ర్కీనింగ్‌ కోసం రోటరీ క్లబ్‌ సౌజన్యంతో రూ. కోటితో అందుబాటులోకి తెచ్చిన మోబైల్‌ కేన్సర్‌ స్ర్కీనింగ్‌ బస్సు, నీనా రావు చారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారంతో రూ. 3 కోట్లతో నిర్మించిన 300 పడకల బ్లాక్‌, రూ. 45 లక్షల విలువైన డెంటల్‌ ఎక్స్‌రే యంత్రం, రూ. 3 కోట్లతో నిర్మించిన ఈహెచ్‌ఎ్‌స బ్లాక్‌లను హరీశ్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు. ''ఎంఎన్‌జే కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో మొదటిసారిగా రోబోటిక్‌ సర్జరీని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. కేన్సర్‌ మహమ్మారి ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించి అక్కడే ఉన్న పీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రుల్లోనే డయాలసిస్‌ రోగుల తరహాలో కీమో, రెడియోథెరపీలను అందించనున్నాం. దీనివల్ల అటు రోగులకు ఇబ్బంది, ఇటు ఎంఎన్‌జేపై భారం తగ్గుతుంది. ఆస్పత్రిలో ప్రస్తుతం మూడు ఆపరేషన్‌ థియేటర్లు ఉండగా ప్రతి ఏటా 4 వేల మైనర్‌, 1500 మేజర్‌ సర్జరీలు నిర్వహిస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రూ. 15 కోట్లతో మరో 8 మాడ్యులార్‌ ఆపరేషన్‌ థియేటర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రోబోటిక్‌ సర్జరీ ద్వారా వైద్యులు కేన్సర్‌ కణాలను తొలగించడానికి వీలు కలుగుతుంది. 3డి సాంకేతికతతో కీళ్లమార్పిడిని వైద్యులు నిర్వహిస్తున్నారు. ఇందులో కేన్సర్‌ సోకిన ఎముకను తొలగించి, అదే పరిమాణంలో మరో ఎముకను ఏర్పాటు చేస్తున్నారు. పలు రకాల కేన్సర్లను స్ర్కీనింగ్‌ చేసేందుకు తీసుకొచ్చిన బస్సును అన్ని జిల్లాల్లోనూ వాడుకునేందుకు వీలు కల్పిస్తాం. ఏప్రిల్‌లో అందుబాటులోకి రానున్న 300 పడకల బ్లాక్‌తో ఎంఎన్‌జే పడకల సంఖ్య 750కి పెరుగుతుంది. ఆస్పత్రికి పక్కనే ఉన్న మరో 3 ఎకరాల స్థలాన్ని ఎంఎన్‌జేకు త్వరలో కేటాయిస్తాం, కొత్తగా ప్రారంభించిన పేషెంట్‌ అటెండెంట్‌ బ్లాక్‌లో రూ. 5కే భోజనం పంపిణీ చేస్తాం. కొత్త రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎంఎన్‌జే బడ్జెట్‌ను రెట్టింపు చేసి, 200 మందికి పోస్టులు మంజూరు చేశాం. ములుగు, సిరిసిల్లా జిల్లాల్లో ప్రయోగాత్మకంగా హెల్త్‌ ప్రొఫైల్‌ నమోదు కార్యక్రమం ఉంటుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య అందించేందుకు రూ.100 కోట్లను ఖర్చు చేస్తున్నాం'' అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ చైర్మన్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఎంఎన్‌జేలో పలువురు రోగులు ఆయనకు తమ సమస్యలు వివరించే ప్రయత్నం చేయగా సిబ్బంది అడ్డుకోవడం, ఆయన వెళ్లిపోవడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)