నగలు, నగదుతో పెళ్లి కూతురు పరార్!

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లో రాజ్‌నగర్‌లోని దల్పత్‌పురా ప్రాంతానికి చెందిన సోహన్ లాల్ అహిర్వార్ వివాహం ఈ ఏడాది ఆరంభంలో ఘనంగా జరిగింది. దినేష్ సాకేత్ అనే వ్యక్తి ఆ పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. జనవరి 10న అతడు సోహన్ ఇంటికి వెళ్లాడు. పుష్పా దేవి అనే యువతి ఉందని చాలా మంచి అమ్మాయని చెప్పి పెళ్లికి ఒప్పించాడు. సంబంధం తీసుకొచ్చినందుకు సోహన్ లాల్ నుంచి దినేష్ రూ.10వేలు వసూలు చేశాడు. సత్నాలో వివాహం జరుగుతుందని చెప్పాడు. ఆ మరుసటి రోజు సోహన లాల్ కుటుంబ సభ్యులు, బంధువులు సత్నాకు వెళ్లారు. అక్కడ గీర్వా మాత ఆలయంలో వివాహం ఘనంగా జరిగింది. అదే రోజు వధూవరులు దల్పత్‌పురాకు వెళ్లారు. పుష్పా దేవి 15 రోజుల పాటు అతడితో కాపురం చేసింది. ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. అయితే తనకు మొబైల్ ఫోన్, నగలు కావాలని భర్తను అడగడంతో అతడు రూ.13వేలు విలువైన ఫోన్ కొనిచ్చాడు. అతడి తండ్రి కోడలి కోసం లక్షనర్న రూపాయలను వడ్డీకి తీసుకొచ్చాడు. ఫిబ్రవరి 10న అందరూ ఆభరణాలు తీసుకోవడానికి సోనార్‌కి వెళ్లాల్సి ఉంది. అయితే ఆ రోజు భర్తను టిఫిన్ తీసుకురావాలని బయటకు పంపించింది పుష్పా దేవి. సరిగ్గా అదే సమయంలో దినేష్ అక్కడికి చేరుకున్నాడు. అతడే సోహన్‌కు పెళ్లి చేసిది. దినేష్‌ను కలిసి పుష్ప అతడితో పాటు బైక్‌పై పారిపోయింది. ఆమె భర్త సోహన్ అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ చిక్కలేదు. ఇద్దరు కలిసి ఫోన్, డబ్బులతో ఉడాయించారు. సోహన్‌కు అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి పరిశీలించాడు. నగల కోసం దాచిన లక్షన్నర రూపాయల డబ్బు కనిపించలేదు. పెళ్లిలో పెట్టిన బట్టలు, నగలు కూడా మాయమయ్యాయి. ఆమె పచ్చి మోసగత్తె అని సోహన్ లాల్‌కు అప్పుడు అర్ధమయింది. దినేష్, పుష్ప కలిసి పెళ్లి పేరుతో తనను మోసం చేశారని తెలుసుకున్నాడు. చాలాసార్లు ఆమెకు ఫోన్ చేసినా స్పందించలేదు. చివరకు ఒకసారి ఫోన్ ఎత్తి మాట్లాడిన పుష్ప నీతో ఉండడం నాకు ఇష్టం లేదని మళ్లీ కాల్ చేస్తే బాగోదని హెచ్చరించింది. ఇందులో ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే.. దినేష్ ఎవరో కాదు. పుష్ప ప్రియుడు. వీరిద్దరు కలిసి ఇప్పటి వరకు ఎంతో మందిని పెళ్లి పేరుతో మోసం చేశారు. సోహన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆధార్ కార్డులో ఉన్న వివరాల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. పుష్పా దేవి తండ్రి పేరు ప్యారే లాల్ అహిర్వార్. వారిది యూపీలోని సతారీ జిల్లా చువారి గ్రామం. ఈ వివరాలతో పోలీసులు అక్కడికి చేరుకొని గ్రామస్తులను ఆరాతీశారు. పుష్పా దేవి ఐదేళ్ల క్రితమే ఓ యువకుడితో కలిసి గ్రామాన్ని విడిచి వెళ్లిపోయిందని మళ్లీ రాలేదని చెప్పారు. దినేష్ సాకేత్, పుష్పా దేవి కలిసి ఇలా పెళ్లిళ్ల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారని పోలీసులు తెలుసుకున్నారు. పెళ్లి చేసుకోవడం.. అత్తింటి నుంచి డబ్బు, నగలతో ఉడాయించడం అలవాటుగా మారింది. ఈ మోసగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి గాలిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)