ఆంధ్రప్రదేశ్ లో మరో ఎక్స్‌ప్రెస్‌ హైవే?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో మరో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే రానుంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా చెన్నై-సూరత్‌ కారిడార్‌కు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఇటీవల ఆమోదం తెలిపింది. దేశంలో తూర్పు, పశ్చిమ పోర్టులను అనుసంధానించే ఈ 1,461 కి.మీ. కారిడార్‌లో 320 కి.మీ. ఏపీలో నిర్మించనున్నారు. మొత్తం రూ. 50 వేల కోట్ల అంచనాతో ఆమోదించిన ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి రాచబాట పడనుంది. మరోవైపు చెన్నై-విశాఖపట్నం, ముంబై-ఢిల్లీ కారిడార్‌లతో కూడా దీనిని అనుసంధానించాలని ప్రణాళిక రూపొందించడం రాష్ట్రానికి మరింత ఉపయుక్తంగా మారనుంది. తూర్పు, పశ్చిమాలను అనుసంధానిస్తూ దేశంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య సరుకు రవాణాలో వ్యయ, ప్రయాసలను తగ్గించేందుకు చెన్నై-సూరత్‌ కారిడార్‌ను నిర్మించనున్నారు. ప్రస్తుతం చెన్నై నుంచి సూరత్‌కు నెల్లూరు, హైదరాబాద్, షోలాపూర్, పుణెల మీదుగా వెళ్లాల్సి ఉంది. అలాగే రాయలసీమ నుంచి చిత్రదుర్గ, దావణగెరె, బెల్గాం, కొల్హాపూర్, పుణెల మీదుగా ప్రయాణించాల్సి ఉంది. ఈ రెండు మార్గాలు ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినవి. కొత్త ప్రాజెక్టుతో చెన్నై నుంచి మన రాష్ట్రంలోని తిరుపతి, కడప, కర్నూలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, కర్ణాటకలో కోస్గి, రాయచూర్, మహారాష్ట్రలోని షోలాపూర్, నాసిక్‌ మీదుగా గుజరాత్‌లోని సూరత్‌ వరకు ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కానుంది. దాంతో దక్షిణాది నుంచి సూరత్‌కు 350 కి.మీ. దూరం తగ్గడంతోపాటు 6 గంటల ప్రయాణ సమయం కలసి వస్తుంది. ఈ 1,461 కి.మీ. కారిడార్‌లో తమిళనాడులో 156 కి.మీ., ఏపీలో 320 కి.మీ., తెలంగాణలో 65 కి.మీ., కర్ణాటకలో 176 కి.మీ, మహారాష్ట్రలో 483 కి.మీ., మిగిలినది గుజరాత్‌లో నిర్మించనున్నారు. అందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించడం కోసం ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది. డీపీఆర్‌ ఖరారయ్యాక ప్రాజెక్టును చేపట్టి రెండేళ్లలో పూర్తి చేయాలన్నది ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యం. చెన్నై-సూరత్‌ కారిడార్‌ మన రాష్ట్రంలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి ఎంతగానో దోహదపడనుంది. తిరుపతి, శ్రీకాళహస్తి, నెల్లూరు, కడప, కర్నూలు, దొనకొండ ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఆ ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తోంది. చెన్నై-సూరత్‌ కారిడార్‌ నిర్మాణం పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది. పశ్చిమాసియా దేశాల నుంచి భారత్‌కు సూరత్‌ పోర్ట్‌ ముఖద్వారంగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)