విశాఖలో హెచ్‌ఎస్ బీసీ మూసివేత

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నగరమైన విశాఖపట్నంకు ఏపీ ఐటీ రాజధానిగా పేరుంది. అందుకు తగ్గట్లుగానే విశాఖను ఐటీ నగరంగా ప్రపంచానికి పరిచయం చేసిన హెచ్‌ఎస్ బీసీ బ్యాంకు చరిత్ర పుటల్లో కలిసిపోయింది. ఇక్కడి సిరిపురం జంక్షన్‌లోని ఈ కంపెనీని యాజమాన్యం పూర్తిగా మూసేసింది. భవనం ఖాళీ అయిపోయింది. నగరం నడిబొడ్డున ఠీవిగా నిల్చొని ఐటీ రంగంలో మహారాజుగా వెలుగొందిన ఈ ప్రాంగణం ఇప్పుడు వెలవెలబోతోంది. అంతర్జాతీయ బ్యాంకింగ్‌ రంగంలో పేరొందిన హెచ్‌ఎస్ బీసీ విశాఖలో 15 ఏళ్ల క్రితం కేప్టివ్‌ బీపీవో సెంటర్‌ను ప్రారంభించింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తన బ్యాంకులకు ఇక్కడి నుంచే సేవలు అందించేది. గ్రాడ్యుయేట్లకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించింది. ఏడాదిన్నర కింద కంపెనీలో భారీ ఫ్రాడ్‌ జరగడంతో ప్రపంచవ్యాప్తంగా బ్రాంచీలను కుదించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. మన దేశంలో చెన్నై, కోల్‌కతాతో పాటు విశాఖ శాఖనూ మూసేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇక్కడ పనిచేస్తున్నవారిని దేశంలో వివిధ నగరాలకు బదిలీ చేసింది. ఎక్కడికి వెళ్లలేమని చెప్పిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించింది. ఉద్యోగులకు మంచి అనుభవం ఉండడంతో ఇతర కంపెనీల్లో వెంటనే ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఆ విధంగా హెచ్‌ఎస్ బీసీలో పనిచేస్తున్న సుమారు వేయి మంది స్థానికంగా ఉన్న కాడ్యుయెంట్‌, డబ్ల్యుఎన్‌ఎస్‌, పాత్ర తదితర ఐటీ కంపెనీల్లో అవకాశాలు దక్కించుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబరు మొదటి వారానికల్లా ఉద్యోగుల సంఖ్యను జీరోకు తీసుకొచ్చింది. దాంతో ఇక్కడ పనేమీ లేదని, భవనం కూడా ఖాళీ చేస్తున్నామని అద్దెకు ఇచ్చిన యాజమాన్యానికి తెలియజేసింది. ఆ పనులు వారం రోజుల నుంచీ జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు అంటే 2021 ముగిసే నాటికి విశాఖలో హెచ్‌ఎస్ బీసీ శకం ముగిసిపోనుంది. సిరిపురం జంక్షన్‌లో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఐటీ భవనాన్ని నిర్మించారు. అందులో ఏర్పాటైన హెచ్‌ఎస్ బీసీ ఐకాన్‌ సంస్థగా నిలిచింది. ఇప్పుడు ఆ సంస్థ ఖాళీ చేసి వెళ్లిపోవడంతో ఆ భవనాన్ని ఏం చేస్తారో, ఎవరికి ఇస్తారోనని చర్చలు జరుగుతున్నాయి. ఈ భవనానికి స్థలం సమకూర్చినందుకు వీఎంఆర్‌డీఏకు అందులో 22.5 శాతం వాటా ఇచ్చారు. మిగిలిన వాటా ఎల్‌ అండ్‌ టీ, ఏపీఐఐసీ, మరో ఐటీ సంస్థ దగ్గర ఉంది. ప్రస్తుతం ఐటీకి బాగా డిమాండ్‌ ఉన్నందున దానిని ఆ పరిశ్రమ ప్రయోజనాలకు ఉపయోగించాలని, రాబోయే రాజధాని కోసమంటూ కొత్త భవనాల్లా ఖాళీగా ఉంచవద్దని ఐటీ వర్గాలు సూచిస్తున్నాయి. హెచ్‌ఎస్ బీసీ కంటే ముందు ఐబీఎం కూడా ఇలాగే తరలిపోయింది. రుషికొండ ఐటీ పార్కులో కెనెక్సా కంపెనీని టేకోవర్‌ చేసిన ఐబీఎం 400 మంది ఉద్యోగులతో నాలుగేళ్ల పాటు నడిచింది. హెచ్‌ఆర్‌ రంగంలో ఉత్పత్తులు అందించే ఈ సంస్థకు మంచి పేరుంది. అయితే సొంత కారణాలతో ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)