రూ.65 లక్షల నగదు స్వాదీనం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద మంగళవారం సాయంత్రం సెబ్‌ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అంతలో హైదరాబాదు నుంచి ఓ కారు వచ్చింది. పోలీసులు దాన్ని ఆపారు. అయితే డ్రైవర్‌ కారును పక్కకు తిప్పి రూటు మళ్లించాడు. పోలీసులకు అనుమానం వచ్చి వెంటనే చేజింగ్‌ చేశారు. ఆ వాహనం పంచలింగాల, కాశాపురం దారిలో వెళ్లి అక్కడ డెడ్‌ ఎండ్‌ ఉండడంతో ఆగిపోయింది. డ్రైవర్‌ ఎటువెళ్లాలో తెలియక కారును ఆపేశాడు. పోలీసులు వెళ్లి డ్రైవర్‌ను ప్రశ్నించారు. ఎందుకు తప్పించుకున్నావని ఆరా తీస్తే.. భయపడ్డాను సార్‌ అన్నాడు. పోలీసులు వాహనంలో ఉన్న బ్యాగులు ఎంత తనిఖీ చేసినా ఏమీ కనిపించలేదు. కారును చెక్‌పోస్టు వద్దకు తీసుకెళ్తుండగా కొద్ది దూరం వచ్చాక.. డ్రైవరు కొంత నగదును పోలీసులకు ఇవ్వబోయాడు. వాహనంలో మద్యం లేదు. అనుమానాస్పద వస్తువులు లేవు. అయినా డబ్బులు ఎందుకు ఇస్తున్నాడే అనుమానం పోలీసులకు వచ్చింది. చెక్‌పోస్టు వద్దకు వచ్చాక డ్రైవర్‌ సీటు కింద టూల్‌ బాక్సు తెరిచి చూశారు. అడుగు భాగంలో తీసేకొద్దీ నోట్ల కట్టలు బయటకు వచ్చాయి. ఏకంగా రూ.65లక్షల నగదు బయట పడింది. నగదు ఎక్కడిదని అడిగితే.. తన పేరు హరీష్‌ వజహా అని, తనది బెంగళూరు అని చెప్పాడు. హైదరాబాదులో నగదును డ్రా చేసుకుని బెంగళూరు వెళ్తున్నానని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నానని అన్నాడు. నగదుకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో సెబ్‌ పోలీసులు దాన్ని తాలుకా పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో సీఐ మంజుల, ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌ నాయక్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ఖాజా, మహ్మద్‌, కానిస్టేబుళ్లు మురళి, సుంకన్న, విజయభాస్కర్‌ పాల్గొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)