సింగరేణి కార్మికులకు రూ.40 లక్షలు బీమా!

Telugu Lo Computer
0


సింగరేణి కార్మికులకు రూ.40 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసేందుకు భారతీయ స్టేట్‌ బ్యాంకు అంగీకరించింది. ఎస్ బీఐ ఖాతా ఉన్న ప్రతి కార్మికుడికి ఈ సదుపాయం వర్తించనుంది. ఈ మేరకు సింగరేణి సంచాలకుడు ఎన్‌.బలరామ్‌, ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అమిత్‌ జింగ్రాన్‌ సమక్షంలో.. హైదరాబాద్‌లోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఒప్పంద పత్రాలపై ఇరు సంస్థల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ఇంతకు మునుపు రూ.20 లక్షలు బీమా సదుపాయం ఉండగా.. ఇకనుంచి రూ.40 లక్షలకు పెంచినట్లు ఈ ఒప్పందంలో పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగులకు లబ్ధి చేకూరే పలు రాయితీలను కూడా ఇందులో కల్పించారు. కొత్త ఒప్పందం వచ్చే నెల 4వ తేదీ నుంచి అమలులోకి రానుంది. విశ్రాంత కార్మికులకు కూడా ఈ ప్రమాద బీమాను వర్తింపజేయాలని కోరగా.. దీనిపై మరో ప్యాకేజీతో ఒప్పందానికి ముసాయిదా ప్రతిపాదన సమర్పించాలని సంబంధిత అధికారులను అమిత్‌ జింగ్రాన్‌ ఆదేశించారు. ఉద్యోగి వేతనం, హోదాకు సంబంధం లేకుండా ప్రమాద బీమా కల్పిస్తారు. ప్రమాదంలో శాశ్వత అంగ వైకల్యానికి కూడా రూ.40 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.20 లక్షల బీమా, డిమాండ్‌ డ్రాఫ్ట్‌లకు, పాస్‌ బుక్‌లకు, ఏటీఎం కార్డు లావాదేవీలకు ప్రస్తుతం ఉన్న ఛార్జీలు ఎత్తివేత వంటి సౌకర్యాలూ కల్పిస్తారు. ఏటీఎం కార్డు ద్వారా ప్రస్తుతం ఉన్న రూ.40 వేల గరిష్ఠ విత్‌డ్రా పరిమితి రూ.లక్షకు పెంపు, ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో కూడా ఉచిత విత్‌డ్రా సౌకర్యం, ఉచిత ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలు కల్పించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)