నీళ్లపై తేలియాడే రాతి విగ్రహం !

Telugu Lo Computer
0


బుద్ధ నీలకంఠ ఆలయం.. ఈ పేరు వినగానే ఇదేదో బుద్ధిడి ఆలయం అనుకోకండి. ఇది నారాయణుడి క్షేత్రమే. బుద్ధ నీలకంఠ అంటే పురాతన నీలి రంగు విగ్రహం అని అర్థం. ఈ పేరుమీదే ఆ ఊరిపేరు అలా స్థిరపడిపోయింది. ఆ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సుమారు ఐదు అడుగుల పొడవున్న ఈ భారీ రాతి విగ్రహం నీటి మీద తేలుతూ ఉంటుంది. ఇంత భారీ విగ్రహం నీటిపై తేలడం అంటే స్వామిమహిమ కాక ఇంకేంటి అంటారు స్థానికులు. నారయణుడిని చూసేందుకు వచ్చే భక్తులు, పర్యాటకులతో ఈ క్షేత్రం నిత్యం కళకళలాడుతుంటుంది. రాతి విగ్రహం వెనుక ప్రచారంలో ఉన్న కథలు ఈ భారీ రాతి విగ్రహం వందల ఏళ్లుగా నీటిపై తేలుతూనే ఉందట. ఈ విగ్రహ నిర్మాణానికి సంబంధించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. * ఒక రైతు తన భార్యతో కలిసి పొలం దున్నుతుండగా ఓ చోట నాగలి ఆగిపోయింది. అక్కడ భూమిలో నాగలి దిగిన ప్రదేశం నుంచి రక్తం బయటకు రావడం చూసి భూమిని తవ్వగా భారీ విగ్రహం బయట పడిందట. గ్రామస్తులంతా కలసి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించి పూజలిందుసున్నారని చెబుతారు. * ఏడో శతాబ్దంలో నేపాల్‌ ప్రాంతాన్ని గుప్త రాజు విష్ణుగుప్తుడు పాలించేవాడు. ఈయన సామంత రాజు , ఖాట్మండు లోయను పాలిస్తున్న లిచ్చవి వంశీయుడైన భీమార్జున దేవుడు ఈ విగ్రహాన్ని తయారు చేయించి, ఇక్కడ ప్రతిష్ఠించాడని చెబుతారు. బుద్ధ నీలకంఠ ఆలయంలో ఉన్న విష్ణువు విగ్రహం వెల్లకిలా పడుకున్న భంగిమలో ఉంటుంది.ఆ విగ్రహాన్ని ఒకే రాతిపై చెక్కారు. పాల సముద్రంలో విష్ణువు శయనించి ఉన్నట్టే కనిపిస్తుంది. ఆదిశేషువు 11 తలలు, 4 చేతుల్లో సుదర్శన చక్రం, శంఖం , తామరపువ్వు, గద ఉంటాయి. యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఒక్కోసారి శివుడిలా అనిపిస్తుందట. అందుకే శివకేశవులకు ఎంతో ప్రీతి పాత్రమైన కార్తీకమాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. శివుడు హాలాహలాన్ని కంఠంలో దాచుకున్నప్పుడు ఆ వేడి తాళలేక ఈ ప్రాంతానికి వచ్చాడనీ ఇక్కడి కొలనులో నీళ్లు సేవించగానే మంట తగ్గి కొంతసేపు సేదతీరాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)