ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో తెలియదంటే ఇదేనేమో!

Telugu Lo Computer
0


పుదుచ్చేరిలో ప్రస్తుతం బాక్సింగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్‌ల్లో పాల్గొనేందుకు కోయంబత్తూరు నుంచి అమృత(19), భూమతి(19) అనే విద్యార్థినులు తమ కోచ్ సర్వేశ్వరన్ (25)తో కలిసి పుదుచ్చేరికి వెళ్లారు. పనిలో పనిగా పుదుచ్చేరిలో ఉన్న టూరిస్ట్ ప్లేస్‌లను చూడాలని నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 8న సాయంత్రం 4 గంటల సమయంలో బీచ్‌కు చేరుకున్నారు. ముగ్గురూ బీచ్‌లో దిగి ఎంజాయ్ చేస్తుండగా ఉధృతంగా వచ్చిన ఓ అల వారిని సముద్రంలోకి లాక్కెళ్లిపోయింది. వాళ్లను చూసిన వారు కాపాడాలంటూ గట్టిగా కేకలేశారు. స్థానికులు కాపాడేందుకు సముద్రంలోకి వెళ్లారు. కోచ్ సర్వేశ్వరన్, విద్యార్థిని అమృతను ఒడ్డుకు చేర్చారు. వారికి ప్రథమ చికిత్సనందించి మెరుగైన చికిత్స నిమిత్తం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. విషాదం ఏంటంటే.. మరో యువతి భూమతి కోసం ఎంత వెతికినా జాడ తెలియలేదు. చాలా సేపు వెతుకులాట సాగించగా.. ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే.. భూమతిని ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. ఆమె ప్రాణాలతో లేదని వైద్యులు నిర్ధారించారు. ఆమె చనిపోయిందన్న సంగతి తెలిసి విద్యార్థినులు భోరున విలపించారు. స్థానిక ఇన్‌స్పెక్టర్ కణ్ణన్, ఇతర పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బాక్సింగ్ మ్యాచ్‌లో పాల్గొనడానికని వస్తే ఇలా ఊహించని విధంగా ప్రాణాలు పోవడంతో యువతి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు స్పందిస్తూ.. మరీ అంత లోతుకు కూడా వెళ్లలేదని.. అలల ఉధృతి ఎక్కువగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఏదేమైనా బంగారం లాంటి భవిష్యత్ కళ్ల ముందు ఉన్న ఈ యువతి అకాల మరణం కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఆ కోచ్, మరో విద్యార్థిని ఇంకా ఆ షాక్‌లో నుంచి తేరుకోలేదు. సముద్రం వద్ద ఎంజాయ్ చేసే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, వీలైనంత వరకూ లోపలకు వెళ్లకుండా ఉంటేనే శ్రేయస్కరమని పోలీసులు సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)