తెలంగాణలోనూ త్వరలో ఆన్‌లైన్‌ ప్రక్రియ!

Telugu Lo Computer
0


కరోనా వైరస్ రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత అఖండ, పుష్ప చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమకు మంచి ఊపు వచ్చిందని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పరిశ్రమకు ఊరట కల్పించాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో టికెట్ ధరలు పెంచేందుకు అనుమతించామని, అంతేకాక, ఐదో ఆటకు కూడా అనుమతి ఇచ్చామని తెలిపారు. సినీ పరిశ్రమపై వేలాది మంది ఆధారపడి బతుకుతున్నారని, అందుకే వారి సమస్యలపై సత్వరమే స్పందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కూడా త్వరలోనే సినిమా టికెట్ల కోసం ఆన్‌ లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్​ తెలిపారు. అయితే, సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రభుత్వం బలవంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోదని స్పష్టం చేశారు. సందర్భాన్ని బట్టే ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ప్రస్తుత కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులు మరింత గట్టిగా కనుక ఉంటే మళ్లీ థియేటర్లపై ఆంక్షలు తప్పవని అన్నారు. చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా ఉండాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని పేర్కొన్నారు. 'ఏపీలో సినిమా థియేటర్ల సమస్యలపై ఆ రాష్ట్ర మంత్రులతో నేను మాట్లాడతాను. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. త్వరలోనే ఆన్‌ లైన్‌ సినిమా టికెట్ల పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం'' అని మంత్రి అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)