ఆస్తి వివాదానికి కుటుంబం ఆహుతి !

Telugu Lo Computer
0


తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ తూర్పు బజారుకు చెందిన చెందిన మండిగ నాగ రామకృష్ణ అలియాస్‌ నాగు (44)కు భార్య శ్రీలక్ష్మి(33), ఆరో తరగతి చదివే కవలలు సాహితి (12), సాహిత్య (12) ఉన్నారు. నాగు స్థానిక నవభారత్‌లో మీసేవా కేంద్రం నిర్వహిస్తున్నారు. గతంలో ఎల్‌ఈడీ దీపాలు, ఫ్యాన్ల వ్యాపారం చేసి నష్టపోయాడు. కొద్ది నెలల క్రితం డాడీస్‌ రోడ్‌ అనే ఆన్‌లైన్‌ యాప్‌ డీలర్‌షిప్‌ తీసుకున్నారు. భద్రాది, ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాల్లో మండలాల వారీగా డీలర్లనూ నియమించుకున్నారు. డీలర్‌షిప్‌, రాజమహేంద్రవరంలో వ్యాపార కేంద్రం నిర్వహణకు రూ.40 లక్షల వరకు అప్పుచేశాడు. మూడు నెలల క్రితం రాజమహేంద్రవరానికి నివాసాన్ని మార్చాడు. అప్పులతో ఒత్తిడికి గురైన నాగ రామకృష్ణ ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ తల్లి సూర్యావతిపై కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నారు. హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని రూ.3 కోట్ల విలువైన ప్లాటు విక్రయించి డబ్బులివ్వాలంటూ ఇటీవల తల్లిపై ఒత్తిడి పెంచారు. ఈ విషయమై పది రోజుల క్రితం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు సమక్షంలో సూర్యావతి, ఆమె కుమార్తె మాధవి (నాగు సోదరి) పంచాయితీ పెట్టారు. ఉమ్మడి ఆస్తిగా భావించి ఈ నెల 5న విక్రయించాలని అంతా తీర్మానించారు. ఈ క్రమంలో ఆయన రాజమహేంద్రవరం నుంచి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి పాల్వంచ వచ్చారు. రాత్రి మరోసారి ఆస్తి విషయమై వారి మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. అనంతరం సూర్యావతి ముందు గదిలో, మిగిలిన కుటుంబ సభ్యులంతా మరో గదిలో నిద్రపోయారు. సోమవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఇంట్లోంచి గ్యాస్‌ సిలిండర్‌ పేలిన శబ్దం రావడంతో స్థానికులు 'డయల్‌ 100'కు సమాచారమిచ్చారు. మంటలు అదుపులోకి వచ్చేలోపే నాగ రామకృష్ణ, శ్రీలక్ష్మి, సాహిత్య సజీవ దహనమయ్యారు. 80 శాతం కాలిన గాయాలతో ఆర్తనాదాలు చేస్తూ రోడ్డుపైకి వచ్చిన సాహితిని స్థానికులు కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ''ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోవడం వల్లే మంటలు సిలిండర్‌కు వ్యాపించినట్లు సాహితి ఇచ్చిన వాగ్మూలం, ప్రాథమిక ఆధారాలను బట్టి తేలింది. దర్యాప్తులో భాగంగా మృతుడి కారులో ఆత్మహత్య లేఖ స్వాధీనం చేసుకున్నాం. ఆస్తి పంపకాల విషయమై జరిగిన పంచాయితీలో తల్లి, సోదరికి మద్దతుగా నిలిచిన రాఘవేంద్రరావు తనను బెదిరించినట్లు నాగ రామకృష్ణ ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు'' అని పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజ్‌ వెల్లడించారు. సూర్యావతి, మాధవి, రాఘవేంద్రరావులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే తనయుడు పరారీలో ఉన్నారన్నారు. గతంలోనూ పట్టణానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి రాఘవేంద్రరావే తన చావుకు కారణమని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నాగ రామకృష్ణ తమ్ముడు వీర వెంకట సత్యసాయి ప్రసాద్‌ (18) ఇరవై ఏళ్ల క్రితం అదే ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. వీరి కుటుంబం 30 ఏళ్ల క్రితం రాజమహేంద్రవరం నుంచి పాల్వంచ వలస వచ్చి స్థిరపడింది. కుటుంబం ఆత్మహత్య ఘటనలో తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవేంద్రరావు ఖండించారు. 'ఆర్థిక సమస్యలతో నాగ రామకృష్ణ మా కుటుంబాన్ని సంప్రదించాడు. అమ్మను జాగ్రత్తగా చూసుకోమని నచ్చజెప్పా. ఆత్మహత్య లేఖలో ఆయన నా పేరు ఎందుకు ప్రస్తావించాడో తెలియడం లేదు. నేరం రుజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమే'' అని పేర్కొంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మా కుటుంబాన్ని రాజకీయంగా అప్రతిష్ఠపాలు చేసేందుకే కొందరు బాధితుణ్ని ప్రలోభపెట్టి నాపై విమర్శలు చేయించి ఉంటారని ఆరోపించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)