థర్డ్ వేవ్ ముగిసేదెప్పుడు ?

Telugu Lo Computer
0


దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఇప్పటికే మొదలైపోయింది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. నిత్యం లక్షన్నరకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గం.ల్లో దేశంలో 1,79,723 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,23,619గా ఉండగా, రోజువారీ పాజిటివిటీ రేటు 13.29శాతం ఉంది. ముందు ముందు రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది? థర్డ్ వేవ్ ఎప్పుడు పీక్ స్టేజ్‌కి చేరుతుంది? ఎప్పుటి వేవ్ ముగియనుంది? అనే అంశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై పలువురు నిపుణులు వివిధ రకాలుగా అంచనాలువేస్తున్నారు. ఐఐటి కాన్పూర్ లో మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫసర్‌గా పనిచేస్తున్న మనీంద్ర అగర్వాల్ థర్డ్ వేవ్‌పై తన అంచనాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య, వైరస్ ఎన్ని రెట్లు వేగంగా వ్యాపిస్తోంది? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని గణిత విశ్లేషణలతో ఆయన ఈ అంచనాలు వేశారు. దీని ప్రకారం జనవరి నెల మధ్యలో ఢిల్లీ, ముంబైలో థర్డ్ వేవ్ పీక్‌కు చేరే అవకాశముందని అంచనావేశారు. మూడో వారం నుంచి అక్కడ రోజువారీ కేసుల సంఖ్య దిగివచ్చే అవకాశముందని, అలాగే దేశంలో థర్డ్ వేవ్ కర్వ్ వచ్చే నెల ప్రారంభంలో పీక్‌కు చేరొచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు మనీంద్ర అగర్వాల్ వెల్లడించారు. వేవ్ పీక్‌లో ఉన్నప్పుడు దేశంలో మొత్తం రోజువారీ కేసుల సంఖ్య 4 నుంచి 8 లక్షల వరకు నమోదుకావచ్చని తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారం తర్వాత కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశముందన్నారు. మార్చి నెల మధ్యనాటికల్లా దేశంలో థర్డ్ వేవ్ దాదాపుగా ముగిసే అవకాశమున్నట్లు అంచనావేశారు. ఎన్నికల ర్యాలీలతో కరోనా వైరస్ వ్యాపించే అవకాశం లేదని చెప్పలేమన్న మనీంద్ర అగర్వాల్, వైరస్ వ్యాప్తికి దోహదపడే ఇతర బలమైన కారణాలు కూడా ఉన్నాయని అన్నారు. జనాభా సంఖ్య, వ్యాధి నిరోధకశక్తి పరంగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య సారూప్యతలు ఉన్నాయన్నారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటే ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో దక్షిణాఫ్రికాలో ఏం జరిగిందో.. అదే భారత్‌లో కూడా జరుగుతుందని అంచనావేస్తున్నట్లు వివరించారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని భారత్‌లో కూడా దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనావేస్తున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)