ఆ గ్రామం పేరు కొజ్జేపల్లి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామానికి కొజ్జేపల్లి అనే పేరు రావడానికి రెండు రకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వందల ఏళ్ల క్రితం ఈ గ్రామంపై మరొక గ్రామం ప్రజలు ఏదో ఒక కారణం వల్ల దాడికి రాగా.. గ్రామస్తులు ఊరు వదిలి దూరంగా వెళ్లి పెద్ద పెద్ద రాతి బండల చాటున దాక్కున్నారట. అందుకే కొజ్జేపల్లి అనే పేరు వచ్చిందనేది ఒక కథ చెబుతారు. గుత్తి చెరువు సమీపంలో పూర్వం కొంతమంది హిజ్రాలు పూరి గుడిసెలు వేసుకుని నివసించేవారని అందుకే ఆ గ్రామానికి ఆ పేరు వచ్చిందని మరో కథ సైతం స్థానికుల నోట వినిపిస్తుంది. ఏది ఏమైనా ఇప్పటి ఆ గ్రామ యువత మాత్రం ఊరి పేరు వల్ల తమకు అవమాన భారం గా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి చూపులకు వెళ్లినా , బస్సులలో టికెట్లు తీసుకునే సమయంలో, స్నేహితులకు తమ ఊరి పేరు చెప్పాలన్నాఎంతో మానసిక వేదనకు ఈ గ్రామస్తులు గురవుతున్నారు. అనేకమంది ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చి, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తమ బాధను గ్రామస్తులు చెప్పుకోవడంతో ఊరు పేరైతే అయితే గాంధీనగర్ గా మార్పు చేస్తూ గెజిట్ విడుదల చేశారు. కానీ వ్యవహారాలలో మాత్రం కొజ్జేపల్లి అని చెబితే గాని ఊరును గుర్తుపట్టని పరిస్థితి ఉంది. కనీసం ఉత్తరాలు ఊరికి చేరాలంటే గాంధీ నగర్ తో పాటు కొజ్జేపల్లి అని రాయాల్సి రావడం ఇప్పటికీ ఆ గ్రామస్తులను వేధిస్తున్న అంశం. ప్రభుత్వం చర్యలు తీసుకొని ఊరు పేరు మార్పును భారీగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని విద్యావంతులైన ఆ గ్రామ యువత భావిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)