ఢిల్లీలో ఎయిర్ లో పోర్ట్ మాయగాడు అరెస్ట్

Telugu Lo Computer
0


ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వచ్చిపోయే ప్రయాణికులను పరిచయం చేసుకుంటూ, వారికి మాయమాటలు చెప్పి డబ్బులు దండుకుంటున్న వెంకట దినేష్ కుమార్ అనే యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసారు. దినేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. తరచూ ఢిల్లీ విమానాశ్రయానికి వస్తున్న దినేష్ కుమార్ తానొక యూనివర్సిటీ విద్యార్థినని తన ఫ్లైట్ మిస్ అయ్యాననే సాకుతో ప్రయాణికులకు వలవేస్తుంటాడు. చండీగఢ్ నుంచి వచ్చానని, విశాఖపట్నం వెళ్లే విమానాన్ని మిస్ అయ్యానని, విమాన టికెట్ ధర రూ.15,000కాగా తన వద్ద కేవలం రూ.6,500 మాత్రమే మిగిలి ఉందంటూ ఇటీవల ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ఒక యువకుడిని దినేష్ కుమార్ డబ్బులు అడిగాడు. ఆ యువకుడు కూడా విద్యార్థి అవడంతో తన వద్దనున్న రూ.9,250లను మొబైల్ పేమెంట్ ద్వారా దినేష్ కుమార్ కు ట్రాన్స్ఫర్ చేసాడు. వైజాగ్ వెళ్ళగానే డబ్బులు తిరిగి ట్రాన్స్ఫర్ చేస్తానంటూ నమ్మబలికాడు. అయితే రోజులు గడుస్తున్నా దినేష్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకపోవడంతో సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. గతంలోనూ ఇదే తరహా ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వెళ్లి వివరాలు సేకరించారు. ఎయిర్ పోర్టులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అక్కడి అధికారులు…తరచూ ఎయిర్ పోర్టుకు వచ్చే ముఖాలను ట్రాక్ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న దినేష్ కుమార్.. రెండు రోజుల క్రితం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 నుంచి వెళుతుండగా భద్రత సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే 5 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని, ట్విట్టర్‌లో కూడా అతనిపై చాలా ఫిర్యాదులు ఉన్నాయని ఎయిర్ పోర్ట్ పోలీసులు తెలిపారు. గత నాలుగు, ఐదేళ్లుగా ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రయాణికులను వెంకట దినేష్ కుమార్ మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దేశంలోని వివిధ విమానాశ్రయాలకు వెళ్లి ప్రయాణికులను మోసం చేసేవాడని విచారణలో భాగంగా పోలీసులు గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)