శ్రీ మంచాళ జగన్నాధరావు

Telugu Lo Computer
0

 

శ్రీ మంచాళ జగన్నాధరావు గారు రాగాలతో ఆడుకునే వైణికుడు .1921 లో ఉత్తరాంధ్ర చీపురపల్లి గ్రామంలో మంచాళ సుబ్బారావు జోగులమ్మ పుణ్య దంపతులకు జన్మించారు .చిన్నప్పుడు 5 వ ఏట మశుచి వచ్చి ఎడమ కన్ను చూపు పోయింది .కుడికన్ను కూడా ఇంచుమించు 50 ఏళ్ల వయసులో ఉండగా చూపు తగ్గింది .మద్రాసులోని ప్రసిద్ధ నేత్రవైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాసాచారి శస్త్రచికిత్స చేసి మంచాళవారి కళ్ళకు దృష్టిలోపం కొంతవరకు తొలగించారట .మంచాళ వారి బాల్యంలో మేనత్త పాడిన జోలపాటలు తత్వాలు ఆయనకు సంగీతాభిరుచి కలిగించేందుకు కారణం. మంచాళవారి తొలి గురువు బరంపురంలోని సర్వే డైరెక్టర్ కె .పద్మనాభయ్యగారి ధర్మపత్ని ఆదిలక్ష్మమ్మ ( సీతా లక్ష్మమ్మ అని కూడా అనేవారు ).త్యాగరాజ ఘన రాగ పంచరత్నకృతులలో మొదటి నాట రాగకృతి జగదానంద కారక కూడా లక్ష్మమ్మగారు మంచాళవారికి నేర్పారట. అప్పటికి మంచాళ వారి వయసు 5 సం.లు. మంచాళ వారి ఏక సంథాగ్రహ సహజ కౌశల్యాన్ని ఆవిడ గుర్తించి పాఠాలు నేర్పినది. మళ్ళీ నేర్పనక్కర్లేకుండా నేర్చుకుంటున్నాడు పసివాడు అనేవారట ఆమె. 1928 నుంచి మంచాళ రెండో గురువు శ్రీ ఆదిరాజు నరసింహమూర్తి గారి వద్ద నాలుగైదు సంవత్సరాలు నేర్చుకుని 1932.,33 ప్రాంతాల్లో విజయనగరం సంగీత కళాశాలలో ఆరు నెలలున్నారు.అది వారికి నిరుత్సాహమే మిగిల్చింది.తిరిగి బరంపురం వెళ్లి ఆదిరాజు సీతాలక్ష్మమ్మ గారినే ఆశ్రయించారు.సీతాలక్ష్మమ్మ గారు ముత్తుస్వామి దీక్షితుల వారి వంశానికి చెందినవారు. మంచాళ వారికి మొదటి దిట్టమైన పునాది కృతి సంపద భవనం నిర్మితమైనది. రాగాలాపన పద్ధతిలో నైపుణ్యం పెరిగింది. ఇదంతా సీతాలక్ష్మమ్మగారి పుణ్యమే. అదే మంచాళ వారికి తమిళ సంగీతజ్ఞుల సంగీత జ్ఞానపుష్టి మీద మంచి అవగాహన ఏర్పరచింది. తమిళ గృహాలలో క్షేత్రయ్య పదాలు రామదాసు కీర్తనలు పాడే గాయనీ గాయకులు ముఖ్యంగా గృహిణులు ఎక్కువమంది ఉండేవారు. రామదాసు కీర్తనలను ఒరిజినల్ ట్యూన్స్ పాడేవారు. క్షేత్రయ్య పదాలకు కూడా అక్కడ విస్తృతమైన ప్రచారం ఉండేదని అక్కడ భజన సంప్రదాయం చాలా విస్తృతంగా జరుగుతుండేదని త్యాగరాజ స్వామి వారు కూడా భజనలలో పాల్గొనేవారనీ క్షేత్రయ్య రామదాసుల రచనలు త్యాగరాజ స్వామి వారు కూడా పాడేవారనీ అక్కడే లక్ష్మమ్మగారి వద్దనుండి మంచాళ వారు తెలుసుకొని ఉండవచ్చు.అది మంచాళవారి అనంత పరిశోధనయాత్రకు తరువాత క్షేత్రయ్య పదాలను రామదాసు కీర్తనలను తమిళ గృహిణుల వద్దనుండి గాయకుల వద్దనుండి గ్రహించి గ్రంధస్తం చేయడానికి పనికొచ్చింది. మంచాళవారు 1938 లో మద్రాసు ఆకాశవాణిలో ఆడిషన్ టెస్టులో ఎంపికై రేడియో కచేరీలు చేస్తుండేవారు. 1940 లలోనే ఆయన ఎన్ బాలచందర్ తో కలిసి సినీ రికార్డింగ్ లకు ఆర్కెస్ట్రా సమకూర్చేవారట. 1940 నుంచి మంచాళకు శ్రీ విస్సా అప్పారావు గారితో సాన్నిహిత్యం కలిగింది. మంచాళ వారు క్షేత్రయ్య పదాలు పాడుతూ వీణపై పలికించడం విస్సావారికి మంచాళ వారిపై అత్యంత ఆదరణ కలిగించింది. 1941 లో మంచాళ వారికి ప్రసిద్ధ సంగీత విద్వాంసులు పిరాట్ల శంకర శాస్త్రి గారితో పరిచయం కలిగించింది. మంచాళ వారి వాద్యంపై మంచి అభిప్రాయం కలిగింది. మంచాళ వారు సేకరించిన క్షేత్రయ్య పదాలను స్వర సాహిత్యాలతో రాజమండ్రి ఆంధ్రగాన పరిషత్ వారు టి వి సుబ్బారావు గారి సంపాదకత్వాన గ్రంథ రూపంగా ప్రచురించారు.ఈ విధంగా మంచాళ వారి తదనంతరం 134 క్షేత్రయ్య పదాలు 130 భద్రాచల రామదాసు కీర్తనలు అవతారిక రాగ లక్షణాలతో ముద్రణకిచ్చారు.వీరివద్ద 24 తరంగాలు 550 త్యాగరాజ కృతులు స్వర సాహిత్యాలతో సమకూరాయి.  మద్రాసులో మంచాళ వారికి సినిమాలలో మ్యూజిక్ డైరెక్టర్ గ 1944 లో అవకాశం ఆయనను వెతుక్కుంటూ వచ్చింది.అప్పటికే ఆయన 1942 నుంచి 44 వరకు మ్యూజిక్ అకాడమీ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. 1945-46 లలో మంచాళ వారికి మద్రాసు మ్యూజిక్ అకాడెమీలో వాయించే అపురూప అవకాశం లభించడం వారి వైణిక జీవితంలో ఒక మైలురాయి.వారు పాట్నా రేడియో కేంద్రంలో నిలయ విద్వాంసునిగా నియుక్తులైనారు.అంతకుముందే మద్రాసులో సినీ సంగీత డైరెక్టర్ గా ఉన్నసమయంలోనే మంచాళ వారికి తన సరస్వతీ వీణపై సౌలభ్యంతో వాయించడంలో ప్రవీణులైనారు. జాతీయ సంగీత కార్యక్రమాలలో హిందూస్థానీ సంగీతం కచేరీలు చేసేవారు.అలాహాబాద్ లోనే ఆయన లలిత సంగీత ప్రయోక్తగా నియమితులై అక్కడ ఆకాశవాణి సిబ్బందిలో తొలి తెలుగువారు.తొలి దక్షిణాపథం వారైనారు. 1967 నుండి శాస్త్రీయ సంగీత ప్రయోక్తగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. మువ్వగోపాల చూడామణి అనే పేరుతో క్షేత్రయ్య పదాలతో మంచాళ వారు కూర్చిన సంగీత రూపకం దక్షిణాది కేంద్రాలన్నీ ప్రసారం చేశాయి. మంచాళ వారు ఉత్తర హిందుస్థానీ ఉద్యోగ సమయంలో చేసిన కచేరీలో ఒకదానికి ప్రపంచ ప్రసిద్ధ బేగం అఖ్తర్ వచ్చి ఆయన వాయించిన భైరవి విని బేటే అంటూ ఆప్యాయంగా నుదుటిపై ముద్దు పెట్టుకున్నదట. ఇంకా అలీ అక్బర్ ఖాన్ రవిశంకర్ వంటి మహామహులెందరో మంచాళ వారి హిందుస్థానీ వాద్యం విని ఎంతగానో ప్రశంసించారట.  1976 లో పదవీ విరమణ చేసేవరకు మంచాళ వారు తమ పరిశోధన గ్రంథ రచనలలో బిజీగా ఉంటూ రిటైరైన తరువాత కూడా ఎన్నో గ్రంధాలు ప్రచురించారు.వారి గ్రంధాల లిస్ట్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి.రామదాసు కీర్తనలు ( 1975 )క్షేత్రయ్య పదములు ( 1954.,1978 సంగీత నాటక అకాడమీ ప్రచురణ ) త్యాగరాజ కృతులు 6 సంపుటాలు ., 711 కృతులతో తిరుమల తిరుపతి దేవస్థానం 1981) అన్నమాచార్యుల శృంగార ఆధ్యాత్మిక కీర్తనలు 3 సంపుటాలు. టీటీడీ ప్రచురణ 1980 ఆధునిక సంగీతం ( 2 సంపుటాలు 1962 ). ఇవికాక నేషనల్ ఆర్కైవ్స్ కొరకు 7 గంటల వీణ వాద్యం రికార్డింగ్ . 1985 జులై 30 న కీర్తిశేషులైన మంచాళ వారి సంగీతాన్ని వారి టేపుల ద్వారా 16 సిడి లుగా మార్చి భద్రపరచడం ముదావహం.నాటకరంజి రాగ వర్ణం మద్రాసులోని ఒక కచేరి లో మంచాళ వారు వాయించగా విన్న చెన్నై సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ఆ గమక వైవిధ్యానికి అబ్బురపడ్డారట. పీలు బేహాగ్ పహాడీ కాపీ జంఝాకఇ మరుబేహాగ్ వంటి రాగాలలో మంచాళ సిద్ధహస్తులు.వారి సంగీత సేవ మన రాష్ట్ర సంగీత లోకానికి అత్యంత విలువైనది.

Post a Comment

0Comments

Post a Comment (0)