హైదరాబాద్‌ లో హుస్సేన్ సాగర్‌ చుట్టూ నో ఎంట్రీ

Telugu Lo Computer
0


కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు కొన్ని చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షల్ని విధిస్తూ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యామ్నాయం లేని బేగంపేట ఫ్లైఓవర్‌ మినహా మిగిలిన అన్నింటిని శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు మూసేస్తున్నారు. ట్యాంక్‌ బండ్‌పై భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు. శుక్రవారం రాత్రి 10 నుంచి శనివారం తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్‌ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. సచివాలయం పక్కనున్న మింట్‌ కాంపౌండ్‌ లైన్‌ను పూర్తిగా మూసేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు. వీవీ స్టాచ్యూ నుంచి నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రాజ్‌ భవన్‌ మీదుగా మళ్లిస్తారు. బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వచ్చే ట్రాఫిక్‌ని ఇక్బాల్‌ మీనార్, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్‌ వైపు పంపుతారు. లిబర్టీ జంక్షన్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ని జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్‌కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్‌ మీనార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్‌ మీదుగా మళ్లిస్తారు. ఖైరతాబాద్‌ మార్కెట్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వచ్చే వాహనాలను మీరా టాకీస్‌ లైన్‌ మీదుగా పంపుతారు. నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్‌ పైకి పంపరు. వీటిని కర్బాలా మైదాన్, మినిస్టర్స్‌ రోడ్‌ మీదుగా పంపిస్తారు. సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయిలింగ్‌ క్లబ్‌ నుంచి కవాడిగూడ చౌరస్తా, లోయర్‌ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ వైపు మళ్లిస్తారు.


Post a Comment

0Comments

Post a Comment (0)