మెడికల్ క్లెయిమ్‌ను తిరస్కరించడం చట్టవిరుద్ధం:సుప్రీం

Telugu Lo Computer
0


ఏదైనా పాలసీ జారీ చేసిన తరువాత ఆ బీమా చేసుకున్న వ్యక్తి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుపుతూ ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిమ్‌ను తిరస్కరించకూడదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పేర్కొంది. పాలసీ తీసుకున్న సమయంలోనే వినియోగదారుడు తన ఆరోగ్యం వివరాలు సంస్థకు అందించి ఉంటారని, కనుక ప్రస్తుత పరిస్థితిని చూపిస్తూ క్లెయిమ్ తిరస్కరించడం సరికాదని న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే విధంగా పాలసీ తీసుకున్న వ్యక్తికి పూర్తి వివరాలు బీమా సంస్థకు వెల్లడించాల్సిన బాధ్యత ఉందన్నారు. బీమాకు సంబంధించిన అన్ని వాస్తవాలు, విషయాలు పాలసీ తీసుకునే వ్యక్తితో పాటు బీమా సంస్థకు తెలుసునని భావిస్తారు. పాలసీదారుడు బీమా సంస్థ తెలిపే అన్ని విషయాలు తెలుసుకున్నాక పాలసీ తీసుకుంటారు. సంస్థ వ్యక్తుల నుంచి వివరాలు సేకరించి పాలసీ జారీ చేయాల్సి ఉంటుంది. బీమా తీసుకున్న వ్యక్తి ప్రస్తుత వైద్య పరిస్థితిని అంచనా వేసిన తర్వాత క్లెయిమ్‌ను తిరస్కరించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. పాలసీ జారీ చేయడానికి ముందు పాలసీదారుడి ఆరోగ్య ప్రస్తుత పరిస్థితిని తమకు తోచిన విధంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ సంస్థదేనని స్పష్టం చేశారు. పాలసీ ప్రతిపాదిత ఫామ్‌లో ఈ విషయం స్పష్టంగా ఉంటుందని.. ఈ కారణంతోనే పాలసీదారుడు వైద్య ఖర్చుల కోసం క్లెయిమ్ చేసి ఉంటారని బెంచ్ ఇటీవల ఇచ్చిన తీర్పులో పేర్కొంది. తాను అప్లై చేసిన మెడికల్ క్లెయిమ్‌ను జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తిరస్కరించడంపై మన్మోహన్ నందా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న వినియోగదారుడు ఓవర్సీస్ మెడిక్లెయిమ్ బిజినెస్ అండ్ హాలిడే పాలసీని ఇటీవల తీసుకున్నారు. ఈ క్రమంలో శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించి మూడు స్టెంట్‌లు అమర్చారు. ఓ ఇన్సూరెన్స్ సంస్థ తాను తీసుకున్న చికిత్సకు సంబంధించి ఆస్పత్రి ఖర్చులను క్లెయిమ్ చేశారు. కానీ వినియోగదారుడు నందాకు గతంలోనే హైపర్లిపిడెమియా, డయాబెటిస్ ఉన్నాయని.. పాలసీని తీసుకునే సమయంలో ఆయన ఈ విషయాలు చెప్పలేదంటూ క్లెయిమ్ తిరస్కరించారు. మెడిక్లెయిమ్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ఫిర్యాదుదారుడు స్టాటిన్ మందులతో బాధపడుతున్నందున, అతను తన ఆరోగ్య పరిస్థితులను పూర్తిగా వెల్లడించడంలో విఫలమయ్యాడని ఎన్సీడీఆర్సీ నిర్ధారించింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ వినియోగదారుడి మెడికల్ క్లెయిమ్‌ను తిరస్కరించడం చట్టవిరుద్ధమని, పాలసీదారుడు అప్లై చేశాడంటే కచ్చితంగా అతడికి నగదు ఇవ్వాల్సిందేనని సుప్రీం కోర్టు పేర్కొంది. అనుకోని అనారోగ్య సమస్యలు వస్తాయనే మెడిక్లెయిమ్ పాలసీని కొనుగోలు చేస్తారని ఈ విషయం మీకు తెలుసు కదా అని ధర్మాసనం బీమా సంస్థకు సూచించింది. పాలసీ తీసుకున్న వ్యక్తి అనారోగ్యానికి లోనైనప్పుడు ఖర్చులకు సంబంధించిన క్లెయిమ్ తిరస్కకూడదని.. పాలసీ జారీ చేసే సమయంలో అన్నీ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత సంస్థపై ఉంటుందని కోర్టు స్పష్టత ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)