శబరిమల ప్రయాణికులకు రైల్వే సూచనలు!

Telugu Lo Computer
0


శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే  ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. ఈ రైళ్లల్లో ప్రయాణించే వారికి ప్రత్యేకమైన ప్రయాణ సూచనలు జారీ చేసింది. ప్రయాణికులు ఈ రైళ్లల్లో కర్పూరం, అగరబత్తీలను వెలిగించొద్దని హెచ్చరించింది. రైల్వే స్టేషన్ ఆవరణతో పాటు రైలు బోగీలో ఇలాంటివి చేయొద్దని తెలిపింది. రైళ్లల్లో, రైల్వే స్టేషన్లలో మండే స్వభావం గల పదార్థాలను వెలిగించడంపై ఇప్పటికే నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి చర్యల వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలగడంతో పాటు రైల్వే ఆస్తులకు కూడా ముప్పు ఉంటుంది. రైల్వే యాక్ట్ 1989 లోని సెక్షన్ 67, 154, 164, 165 ప్రకారం ఇలాంటి కార్యకలాపాలన్నీ శిక్షార్హమైన నేరాలు. ఈ చర్యలకు పాల్పడేవారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 1000 జరిమానా లేదా రెండూ విధించబడతాయి. దీంతో పాటు ఎవరికైనా గాయాలైనా, నష్టం కలిగినా అందుకూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీంతో పాటు రైల్వే ప్రయాణికులు కోవిడ్ ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలి. రైల్వే స్టేషన్ ఆవరణలో, రైళ్లల్లో మాస్కులు ధరించాలి. ఇతర ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అనవసరంగా గుమికూడకూడదు. రైల్వే ప్రయాణికులు జాగ్రత్తలు పాటిస్తున్నారో లేదో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, కమర్షియల్ బ్రాంచ్‌ల సిబ్బంది నిఘా పెడతారని రైల్వే తెలిపింది. శబరిమల వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జనవరి మూడోవారం వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)