వక్రీకరణకు సుప్రీంకోర్టు ఆక్షేపణ !

Telugu Lo Computer
0


తమను విలన్లు మాదిరిగా చూపిస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. దిల్లీ, పొరుగు రాష్ట్రాల్లో వాయు కాలుష్యంపై దాఖలైన వ్యాజ్యంపైన విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. కాలుష్యం దృష్ట్యా దిల్లీలోని పాఠశాలలను మూసివేయాలని కోర్టు ఆదేశించిందంటూ ఓ ఆంగ్లపత్రిక ప్రచురించింది. దీన్ని ప్రస్తావించిన జస్టిస్‌ రమణ ''కావాలని చేస్తున్నారో ఏమో తెలియదు. మీడియాలో ఓ వర్గం మమ్మల్ని విలన్లుగా చూపెడుతోంది. పాఠశాలలు మూసివేయాలని చెప్పామని అంటోంది. మేమెక్కడ చెప్పాం? కాలుష్య స్థాయి అధికంగా ఉన్న సమయంలో పెద్దలు ఇంటి నుంచి పనిచేస్తుంటే పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారని మాత్రమే వ్యాఖ్యానించాం. కార్యాలయాలు, పాఠశాలలను మూసివేస్తామని ఢిల్లీ ప్రభుత్వమే చెప్పింది'' అని అన్నారు. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.ఎం.సింఘ్వి మాట్లాడుతూ ఢిల్లీలో పరిపాలనను తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించినట్టు మరో ఆంగ్ల పత్రిక రాసిందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ ''మీరు దీనిని ఖండించాలి. పరిపాలన బాధ్యతలు చేపడతామని మేమెక్కడ చెప్పాం? భావస్వేచ్ఛను మేం అడ్డుకోలేం. ఎవరైనా విలేకరుల సమావేశం పెట్టుకోవచ్చు. మేం ఆ పని చేయలేం'' అని తెలిపింది. జస్టిస్‌ చంద్రచూడ్‌ తన అనుభవాలను వివరిస్తూ న్యాయవ్యవస్థ మౌలిక సౌకర్యాల విషయమై చేసిన వ్యాఖ్యలను కూడా కొన్ని పత్రికలు వక్రీకరించాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల వద్దకు హైకోర్టులు భిక్షాపాత్రలు తీసుకొని వెళ్లాల్సి ఉంటుందంటూ రాశాయని తెలిపారు. ప్రధాన వ్యాజ్యంపై నిర్ణయాన్ని వెలువరిస్తూ కాలుష్య నివారణపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కేంద్రం, రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)