జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో పిటిషన్‌ ఉపసంహరణ

Telugu Lo Computer
0


ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి కొద్ది రోజుల క్రితం కోర్టులో విచారణ సాగింది. బెయిల్ కండీషన్ ప్రకారం విచారణ హాజరు కావాలనే అంశం పైన వాదనలు జరిగాయి. అయితే, అప్పుడు జగన్ ఎంపీగా, ఎమ్మెల్యేగా హాజరయ్యారని ఇప్పుడు ఆయన సీఎం కావటంతో ఎదురవుతున్న పరిస్థితులను జగన్ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. విజయ సాయిరెడ్డి హాజరు పైన కోర్టు ప్రశ్నించింది. ఇప్పుడు  అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లలో మరో నిందితుడు తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. క్విడ్‌ ప్రోకో వ్యవహారంలో సీఎం జగన్‌, విజయసాయిరెడ్డి సహా పలువురిపై సీబీఐ కేసులు నమోదు చేసి, మొత్తం 11 చారిషీట్లను దిగువ కోర్టు (సీబీఐ)లో దాఖలు చేసింది. వీటిలో నిందితులు కేసులు కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసులపై హైకోర్టు రోజువారీ విచారణ చేపడుతోంది. దీంతో నిందితులు తమ పిటిషన్లను ఉపసంహరించుకుంటున్నారు. తాజాగా లేపాక్షి కేసులో ఆరో నిందితుడిగా ఉన్న శ్రీనివాస బాలాజీ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్‌ తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు నివేదించారు. ఇందుకు కోర్టు సైతం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే పలు కేసుల్లో నిందితులుగా ఉన్న బీపీ ఆచార్య, పునీత్‌ దాల్మియా, శ్యాంప్రసాద్‌రెడ్డి సైతం హైకోర్టులో తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. దీని పైన సీబీఐ వాదన మరోలా ఉంది. ఆలస్యం చేయడానికే ఇలా చేస్తున్నారని, దిగువ కోర్టులో విచారణ సాగకుండా స్టే తెచ్చుకుని ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నారని సీబీఐ అభిప్రాయ పడుతోంది. ఇదే సమయంలో.. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి బీపీ ఆచార్య పిటిషన్‌పై హైకోర్టు విచారణ కొనసాగించింది. ఆచార్య తరఫున న్యాయవాది ప్రద్యుమ్న కుమార్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ లేపాక్షి కేసులో ఎలాంటి నష్టం జరుగలేదని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పేర్కొందని తెలిపారు. తనపై కేసు నమోదుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని.. దానిపై తాము రివ్యూ దాఖలు చేశామని పేర్కొన్నారు. అది ఇంకా పెండింగ్‌లో ఉందని తెలిపారు. తనపై దర్యాప్తునకు అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిందని న్యాయవాది కోర్టుకు నివేదించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)