మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో వర్ష బీభత్సం కొనసాగుతున్న జిల్లాలకు ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక అధికారులను పంపారు.  నెల్లూరుకు సీనియర్‌ అధికారి రాజశేఖర్, చిత్తూరుకు ప్రద్యుమ్న, కడపకు శశిభూషణ్‌ కుమార్‌లను నియమించారు. జిల్లాల్లోని అధికారులతోనూ మాట్లాడారు. బాధితులను ఆదుకోవడానికి యుద్ధప్రాతిపదికన పని చేయాలని ఆదేశించారు. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని స్పష్టం చేశారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలన్నారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. పరిహారం వీలైనంత త్వరగా అందించాలన్నారు. వినతులపై తక్షణమే స్పందించాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటల నష్టంపై అంచనా వేయాలని, రైతులు మళ్లీ పంటలు వేసుకునేందుకు విత్తనాలు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. గండ్లు పడ్డ చెరువుల వద్ద యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. రిజర్వాయర్లు, చెరువుల దగ్గర ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా చేస్తూ చర్యలు చేపట్టాలని సీఎం జగన్ సూచించారు. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రైళ్లు, విమానాలు రద్దయిన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో యాత్రికులు కిందకు రాకుండాపైనే ఉంచాలని ఆదేశించారు. కనీసం ఒకటి, రెండు రోజులు వారికి తగిన వసతులు సమకూర్చాలని స్పష్టం చేశారు. టీటీడీ అధికారులను సమన్వయం చేసుకుని యాత్రికులకు సహాయంగా నిలవాలన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)