11 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పూర్తి మెజార్టీతో ఉన్న అధికార వైసీపీ,  శాసనమండలిలోనూ అత్యధిక సభ్యులు కలిగిన పార్టీగా అవతరించింది. అసెంబ్లీలో 151 మంది వైసీపీకి ఉండగా, టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు పరోక్షంగా వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే సైతం అదే బాటలో ఉన్నారు. ఇక శాసన మండలిలో ఇప్పటి వరకు మెజార్టీతో ఉన్న టీడీపీ సంఖ్యా బలం ఒక్కసారిగా తగ్గిపోయింది. స్థానిక సంస్థల కోటాలో నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీకి చెందిన 11 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో టి. వెంకట శివ నాయుడు తన నామినేషన్ ను ఈరోజు ఉపసంహరించుకోవడంతో... మొత్తం 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను వైయస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అసెంబ్లీలో సంఖ్యా బలం.. స్థానిక సంస్థల్లో అన్ని జిల్లాల్లో గెలవటం తో పాటుగా గవర్నర్ నామినేటెడ్ కోటాతో కలిసి మొత్తంగా వైసీపీకి కలిసి వచ్చింది. మొత్తం 58 మంది సభ్యులు ఉంటే శాసనమండలిలో ఇప్పుడు వైసీపీ సభ్యుల సంఖ్య 32కు చేరింది. స్థానిక సంస్థల కోటా నుంచి మొత్తం ఎనిమిది జిల్లాల్లో 11 మంది మండలికి ఎన్నికయ్యారు. విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరు రఘురాజు ..విశాఖ నుంచి వరుదు కళ్యాణి, వంశీక్రిష్ణ ఎన్నికయ్యారు. తూర్పు గోదావరి నుంచి అనంత ఉదయ భాస్కర్ మండలికి ఎంపికయ్యారు. క్రిష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్ ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు, మురుగుడు హనుమంత రావు ను ఎంపిక చేయగా వారిద్దరూ సైతం ఇప్పుడు మండలికి ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు మండలికి ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా నుంచి క్రిష్ణ రాఘవ జయేంద్ర భరత్.. అనంతపురం జిల్లా నుంచి వై శివరామి రెడ్డి ఎన్నికయ్యారు. ఈ 11 స్థానాలు వైసీపీ ఖాతాలో జమ అవ్వటం ద్వారా వైసీపీ సభ్యుల సంఖ్య 32 కాగా, టీడీపీ సంఖ్యా బలం 15కు తగ్గింది. బీజేపీ నుంచి ఒకరు, పీడీఎఫ్ నుంచి నలుగురు సభ్యులు సభలో ఉన్నారు. ఇక, వైసీపీ నుంచి సభ్యులుగా ఉన్న వారిలో 18 మంది ఎస్సీ - బీసీ - మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఉంటారు. అందులో నలుగురు మైనార్టీలు.

Post a Comment

0Comments

Post a Comment (0)