వరుసగా నాలుగో రోజూ నష్టాలే !

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఆద్యంతం నష్టాల్లో కొనసాగాయి. దీంతో వరుసగా నాలుగో రోజూ సూచీలు నష్టాలు మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా కీలక రంగాల సూచీల స్థిరీకరణ మార్కెట్లపై ప్రభావం చూపింది. అమెరికా మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఒక్క షాంఘై కాంపోజిట్‌ మినహా ఆసియా-పసిఫిక్‌ సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్‌, టెక్, టెలికాం, ఆర్థిక రంగాల్లో స్థిరీకరణ కొనసాగుతోంది. మరోవైపు గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే సహజవాయువు, సీఎన్‌జీ, ఎల్‌పీజీ ధరలు సైతం పెరిగాయి. దీంతో దవ్ర్యోల్బణ భయాలు మదుపర్లను వెంటాడాయి. ఇంధన ధరల పెరుగుదల వల్ల అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్న సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కలవరపెడుతోంది. మరోవైపు రాబోయే పరపతి విధాన సమీక్షలో రివర్స్‌ రెపో రేటును ఆర్‌బీఐ సవరించే అవకాశం ఉందని సిటీ గ్రూప్‌ అంచనా వేయడం దేశీయంగా మదుపర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు నష్టాలను చవిచూశాయి. ఉదయం సెన్సెక్స్‌ 58,889.77 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. 58,551.14 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 360.78 పాయింట్ల నష్టంతో 58,765.58 వద్ద ముగిసింది. నిఫ్టీ 17,57-17,452 మధ్య కదలాడి చివరకు 86.10 పాయింట్లు నష్టపోయి 17,532.05 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.11 వద్ద ముగిసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)