లిఫ్టులో రక్తపుమరకలు ఎవరివి..?

Telugu Lo Computer
0



విశాఖపట్నంలోని శనివాడలో మైనర్ బాలిక పాండ్రంగి పావని అనుమానాస్పద మృతిపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. పావనిది ఆత్మహత్య అని పోలీసులు ఇప్పటికే తేల్చగా, బాలిక బంధువులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పావనిని అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మంత్రి అవంతి శ్రీనివాస్, విజయసాయిరెడ్డి ఘటన జరిగిన అపార్ట్ మెంట్ ను పరిశీలించి, బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. పావని మృతి దురదృష్టకరమని.. తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. పోలీసులు చెప్పిన దానికి, తల్లిదండ్రులు చెప్పిన దానికి వ్యత్యాసముందని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు రెండు విషయాలు విచారణ జరపాల్సి ఉందని, ఆరో అంతస్తు నుంచి పడితే కూర్చొని ఉండటం అసాధ్యమన్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసు జాగిలాలను ఎందుకు పిలవలేదన్నారు. తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై పోలీస్ కమిషనర్ తో మాట్లాడతానని తెలిపారు. పావని కేసులో తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని.. మృతురాలి తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

కుటుంబ సభ్యుల అనుమానాలివే..!

పావనికి యువకుడితో సంబంధం ఉందనడానికి పోలీసుల దగ్గర ఆధారాలేవీ లేవని చెప్తున్నారు. యువకుడితో కలిసుండగా తల్లిదండ్రులు రావడంతో అపార్ట్ మెంట్ పై నుంచి దూకి చనిపోయిందని పోలీసులు చెబుతున్నారని.. ఇద్దరూ కలిసుండగా ఎవరూ చూడలేదు కదా..? అని ప్రశ్నిస్తున్నారు. పావని చనిపోయిన రోజు రాత్రి ఆరోజు రాత్రి 11.40 గంటల సమయంలో సమీపంలోనే వుంటున్న బాలిక స్నేహితురాలు వీడియో కాల్‌ చేస్తే...ఆమెతో మాట్లాడుతూ, ఎదురుగా అపార్టుమెంట్‌ పైకి వెళ్లిందని తెలిపారు. అప్పుడు అక్కడ ఆమెను...ఏదో చేసి, చంపేశారని, శవాన్ని మెట్ల మీద నుంచి కానీ, లిఫ్టులో కానీ తీసుకొచ్చి కింద పడేశారని ఆరోపించారు. ఆరు అంతస్థుల పైనుంచి కిందకు పడితే ఆమె కాళ్లు, చేతులు విరిగిపోతాయని, తల పగులుతుందని...కానీ అటువంటిదేమీ లేవని వివరించారు. తొడపై బ్లేడుతో కోసిన గాయాలు వున్నాయని పేర్కొన్నారు. అలాగే అపార్ట్ మెంట్ లిఫ్టులో రక్తపు మరకలున్నాయని అవి ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)