ఏడాదిన్నరలో పెట్రోల్‌పై రూ.36, డీజిల్‌పై రూ.26 పెరుగుదల

Telugu Lo Computer
0


దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా నాలుగోరోజూ పెరిగాయి. శనివారం లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 36 పైసల చొప్పున పెరిగింది. దీంతో ప్రభుత్వాలు గత ఏడాది మే నెలలో పన్నులు రికార్డు స్థాయికి పెంచిన తర్వాత లీటర్‌ పెట్రోల్‌పై రూ.36 పెరిగింది. డీజిల్‌ రూ.26.58 ప్రియమైంది. ప్రస్తుతం దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107.24గా, డీజిల్‌ రూ.95.97గా ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడమే దేశీయంగా ఇంధన ధరల పెంపునకు కారణమని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా రవాణా, పారిశ్రామిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయంగా చమురుకు గిరాకీ తగ్గి బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 19 డాలర్ల దిగువకు చేరింది. ఈ ధరల తగ్గుదల ప్రయోజనాల్ని సామాన్యులకు చేరకుండా.. ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని రికార్డు స్థాయికి పెంచింది. తద్వారా కరోనా మూలంగా ఇతర మార్గాల ద్వారా పడిపోయిన ఆదాయాన్ని ఇలా సమకూర్చుకొంది. దీంతో ధరలు స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి. అయితే, వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా క్రమంగా ఆంక్షలు తొలగిపోతున్నాయి. దీంతో చమురుకు మళ్లీ గిరాకీ పుంజుకుంది. ధరలు కొవిడ్‌ పూర్వస్థితి కంటే కూడా పెరిగాయి. ప్రభుత్వం మాత్రం పెంచిన సుంకాలను అలాగే కొనసాగిస్తూ వస్తోంది. దీంతో సామాన్యుడికి భారం తప్పడం లేదు. దేశంలో డీజిలు, పెట్రోలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే, మరోవైపు ఈ పన్నుల ఆదాయంతోనే వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు కేంద్ర ఇంధనశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి శుక్రవారం మీడియా ఎదుట వెల్లడించారు. వంద కోట్ల డోసుల కొవిడ్‌ ఉచిత వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని, కరోనా కష్టకాలంలో ఏడాది పొడవునా 90 కోట్ల ప్రజలకు మూడు పూటలా భోజన సదుపాయం కల్పించామని, ఉజ్వల పథకం కింద 8 కోట్ల మహిళలకు ఉచిత వంటగ్యాస్‌ అందజేసినట్లు వివరించారు. ఈ పథకాలన్నీ లీటరు ఇంధనంపై కేంద్రానికి వస్తున్న రూ.32 ఎక్సైజ్‌డ్యూటీతోనే సాధ్యమైనట్టు పురి వివరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)