ఇచ్చుటలో ఉన్న హాయి....!

Telugu Lo Computer
0

                                         

రేడియోలో టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ జరుగుతోంది. అనౌన్సర్, కోటీశ్వరుడైన అతిధిని అడిగాడు- ‘’మిమ్మల్ని అత్యధికంగా సంతోష పెట్టినదేది?’’ 

ఆ కోటీశ్వరుడు ఇలా చెప్పాడు "నేనునా జీవితంలో నాలుగు దశల్లో సంతోషాన్ని చూశాను. చివరికి నిజమైన సంతోషం అంటే ఏమిటో అర్థం చేసుకోగలిగాను.

మొదటి దశలో సంపదను, విలాసవంతమైన వస్తువులను సమకూర్చుకోవడంలో ఆనందాన్ని పొందాను. కానీ అది నేను అనుకొన్న సంతోషం కాదు..

ఇక రెండో దశలో అత్యంత ఖరీదైన విలాస వస్తువులను సేకరించడం మొదలు పెట్టాను. అయితే వాటి వల్ల లభించే ఆనందం కూడా తాత్కాలికమైనదే! అని తెలుసుకున్నాను.’ వ్యామోహాన్ని కలిగించిన ఆ విలువైన వస్తువుల ద్వారా లభించిన ఆనందం ఎంతోకాలం నిలవలేదు.’

ఇక మూడో దశలో  కూడా పెద్ద ప్రాజెక్టులు అంటే ఫుట్బాల్, క్రికెట్ టీమ్ లను కొనుగోలు చేయడం, విలాసవంతమైన పర్యాటక విశ్రాంతి క్షేత్రాలను కొనుగోలు చేయడం వంటివి అన్నమాట. అయితే ఇక్కడ కూడా నేను ఊహించిన ఆనందాన్ని ఎంతోకాలం పొందలేక పోయాను.’

ఇక ఆ నాలుగో దశ ఏమిటంటే -నా స్నేహితుడొకరు, దివ్యాంగులైన పిల్లల కోసం కొన్ని చక్రాల


బళ్ళు కొనివ్వమని అడిగాడు. స్నేహితుని కోరికను మన్నించి వాటిని కొన్నాను. అయితే నా స్నేహితుడు తనతో వచ్చి వాటిని స్వయంగా ఆ పిల్లలకు నేనే అందజేయాలని పట్టుపట్టాడు. చివరికి ఒప్పుకుని అతడితో వెళ్లాను. నా చేతుల మీదగా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ పిల్లల మొహాల్లో, కళ్ళల్లో ఆనందపు మెరుపులు, వెలుగులు గమనించాను. ఆ పిల్లలు ఆ వీల్ చైర్స్ లో కూర్చుని అటు ఇటు సంతోషంగా తిరగడం చూశాను. వాళ్ళంతా ఏదో విహారయాత్రకు వెళ్ళినట్లు వినోదించడం చూశాను.’

అయితే చివరికి వారి నుంచి వీడ్కోలు తీసుకుని, నేను వెళ్ళిపోతున్న సమయంలో నిజమైన సంతోషం ఏమిటో తెలిసి వచ్చింది.

ఒక పిల్లవాడు నా కాళ్ళను పెనవేసుకుని ఆపాడు. 

నేను సున్నితంగా విడిపించుకో చూశాను. అయితే ఆ పిల్లవాడు నా మొహంలోకి పరీక్షగా చూస్తూ, తన చేతి పట్టును మరింత బిగించాడు.

నేను కాస్త వంగి అనునయంగా ఆ పిల్ల వాడిని అడిగాను- నీకు ఇంకా ఏమైనా కావాలా? అని.

అప్పుడు ఆ పిల్లవాడు ఇచ్చిన సమాధానం నాకు నిజమైన ఆనందాన్ని కలిగించడమే కాదు, నా జీవితాన్నే మార్చేసింది. ఆ పిల్లవాడు ఏమన్నాడూ అంటే...

"నేను మీ ముఖాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే స్వర్గంలో నేను మిమ్మల్ని మళ్లీ ఎప్పుడో కలుసుకున్నప్పుడు, మిమ్మల్ని గుర్తుపట్టాలిగా, మళ్లీ ఒకసారి అప్పుడు నా కృతజ్ఞతలు తెలియజేయాలని!" 

ఆ మాటలకు భగవంతునికి ఎన్నెన్నో కృతజ్ఞతలు తెలుపుకున్నాను, జీవిత పరమావధి అనుగ్రహించినందుకు.

Post a Comment

0Comments

Post a Comment (0)