సామ్రాజ్యవాదపు చదరంగంలో మరో పావు

Telugu Lo Computer
0




పశ్చిమదేశాల రాజకీయనాయకులు వరదలాగా మొసలికన్నీళ్లు కారుస్తుండగా, ఆ కన్నీటి ప్రవాహంలో చరిత్ర తుడిచిపెట్టుకు పోయింది. ఇప్పటికి ఒక తరానికి ముందే ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యం సాధించింది. దానిని అమెరికా, బ్రిటన్, ఇతర “మిత్రరాజ్యాలు”కలిసి నాశనం చేశాయి.

1978 లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ విముక్తి ఉద్యమానికి నాయకత్వం వహించి, మొహమ్మద్  ఖాన్ నియంతృత్వాన్ని కూలదోసి విప్లవ ప్రభుత్వాన్ని నెలకొల్పింది. రాజైన జాహిర్ఖాన్ కు ఈ మహమ్మద్ దావూద్ ఖాన్ బంధువు. మహమ్మద్ ఖాన్ నిరంకుశత్వానికి చరమగీతం పాడిన  పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ విప్లవానికి ఆఫ్ఘన్ ప్రజలు హారతిపట్టటం బ్రిటన్, అమెరికాదేశాల పాలకవర్గాలకు ఆశ్చర్యమేసింది. 

“ ఇంటర్వ్యూ చేయబడిన ప్రతిఆఫ్ఘన్ పౌరుడు ఈ కుట్రపట్ల అమిత సంతోషం వ్యక్తం చేయటాన్ని చూసి కాబుల్లో వున్న విదేశీ జర్నలిస్టులు ఆశ్చర్య పోయారు” అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. “లక్షా యాభై వేలమంది  ఆఫ్ఘన్లు ….. నూతన జెండాను గౌరవిస్తూస్వాగతంపలికారు …. వారు నిజంగానే ఉత్సాహంతో వున్నారు” అని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. 

వాషింగ్టన్ పోస్ట్ కూడా ఇదే విధంగా నివేదించింది.”ఈ ప్రభుత్వం పట్ల ఆఫ్ఘన్ల అవిధేయత చాలాఅరుదుగా కనపడుతున్నది.” మతానికి అతీతంగా (సెక్యులర్), ఆధునికతను(మోడరన్), ఆపై కొద్దిగా సామ్యవాదాన్ని(సోషలిజం) సంతరించుకున్న ఈ ప్రభుత్వం ప్రజలముందు తన సంస్కరణల ధృక్కోణాన్ని ప్రకటించింది. ఈ సంస్కరణలతో మహిళలకు, మైనారిటీలకు సమానహక్కులు వచ్చాయి. రాజకీయ ఖైదీలను విడుదల చేశారు. పోలీసుకేసులున్న ఫైళ్ళను బహిరంగంగా తగుల బెట్టారు. 

రాచరికం క్రింద ఆఫ్ఘన్ల ఆయుర్దాయం 35 ఏళ్ళు మాత్రమే. ప్రతి ముగ్గురు పిల్లలలో ఒకరు చనిపోతుండేవారు. 90 శాతం మంది ఏ మాత్రం చదువు రానివారు. అయితే,క్రొత్త ప్రభుత్వం అందరికీ ఉచిత ఆరోగ్యసంరక్షణను కల్పించింది. అక్షరాస్యతకోసం పెద్దఎత్తున  ప్రచారం నిర్వహించింది.

ఈ సంస్కరణలవలన మహిళకు గతంలో  ఎన్నడూలేని సదుపాయాలు కలిగాయి.1980 దశకం రెండో భాగానికల్లా యూనివర్సిటీ విద్యార్ధులలో సగం మంది మహిళలు. ఆఫ్ఘనిస్తాన్ డాక్టర్లలో 40శాతం మంది, ఉపాధ్యాయులలో 70 శాతం మంది, ప్రభుత్వ ఉద్యోగులలో30 శాతం మంది మహిళలు ఉన్నారు.

ఆనాటి జ్ఞాపకాలు వారిపై ఎంత  బలమైన ముద్ర వేశాయి అంటే 2001లో ఆఫ్ఘనిస్తాన్ ను విడిచిపోయిన సైరా నూరాని ఆరోజులను ఈ విధంగా గుర్తు చేసుకున్నది: “ప్రతి ఆమ్మాయి హైస్కూల్లోగాని, యూనివర్సిటీలలోగాని చదువుకుంటున్నది. మేము ఎక్కడికెళ్ళాలన్నా ఎటువంటి ఆంక్షలు లేకుండా వెళ్ళగలిగేవాళ్ళం, మాకిష్టమైన దుస్తులు వేసుకోగలిగేవాళ్ళం...మేము కాఫీ హోటళ్లకు, సినిమాహాళ్ళకు వెళ్ళేవాళ్ళం. శుక్రవారాలు లేటెస్టుగా  విడుదలైన ఇండియన్ సినిమాలు చూసేవాళ్ళం…ముజాహిదీన్ లు గెలవటం మొదలుపెట్టిన తరువాత ఇవ్వన్ని పోయాయి..పశ్చిమదేశాలు ఈ ముజాహిదీన్ లకు మద్దతు ఇచ్చాయి.”

PDPA ప్రభుత్వానికి సోవియెట్ యూనియన్ మద్దతు ఇవ్వటం అమెరికాకు కంటగింపయింది. అయినప్పటికీ ఆరోజుల్లో అమెరికా, బ్రిటన్ పత్రికలు ప్రచారంలో పెట్టినట్టు  సామ్రాజ్యవాద దేశాలు  PDPA ప్రభుత్వాన్ని “తోలుబొమ్మ” ప్రభుత్వమనిగానీ, రాచరికానికి వ్యతిరేకంగా “సోవియట్ దన్ను” తో జరిగిన కుట్ర అనిగాని విమర్శించలేకపోయాయి.

జిమ్మీ కార్టర్ ప్రభుత్వంలో సెక్రటరీ అఫ్ స్టేట్ గా పదవిని నిర్వహించిన సైరస్ వాన్స్ (Cyrus Vance)తన తరువాతి రోజులలో వ్రాసుకున్న  జ్ఞాపకాలలో ఇలా అన్నాడు. “కుట్రలో సోవియెట్ భాగస్వామి అయినట్టు మాకు ఆధారం ఏదీ దొరకలేదు”

అదే కార్టర్ అడ్మినిస్ట్రేషన్ లో నేషనల్ సెక్యూరిటీ సలహాదారుగా బిగ్నేవ్ బ్రేజ్నేస్కి (Zbigniew Brzezinski)  పనిచేశాడు. ఇతను పోలెండ్ నుంచి వలసవచ్చిన వాడు. పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి, మతం చెప్పే నీతులు ఆచరించటంలో అతివాది (Moral Extremist). 2017 లో ఇతను చనిపోయేదాకా అమెరికా ప్రెసిడెంట్లపై  ఎనలేని ప్రభావం చూపాడు.

ఆఫ్ఘనిస్తాన్ లో ఏర్పడిన మొట్టమొదటి లౌకిక, ప్రగతిశీల ప్రభుత్వాన్ని కూల్చటానికై “కోవర్టు” చర్యలకు జిమ్మీ కార్టర్ 500 మిలియన్ డాలర్లు కేటాయించాడు. ఇది కూడా అమెరికా ప్రజలకు, అమెరికా పార్లమెంటుకు తెలియనివ్వకుండా చేసినదే. ఈ కోవర్ట్ చర్యకు రహస్యనామం “సైక్లోన్”(తుఫాన్).

ఈ 500 మిలియన్ డాలర్లను కొండజాతి వారిని, ముజహిద్దీన్లపేరుతొ వున్న మతోన్మాదులను  కొనటానికి, లంచాలు ఇవ్వటానికి, ఆయుధాలు సమకూర్చటానికి ఉపయోగించారు. 70 మిలియన్ డాలర్లను కేవలం లంచాలు ఇవ్వటానికి CIA వాడిందని వాషింగ్టన్ రిపోర్టర్ బాబ్ వుడ్ వర్డ్ పేర్కొన్నాడు.  “గారీ” అని పిలిచే CIA ఏజెంటుకు సాయుధముఠా నాయకుడు ఆమ్నియాత్ మిల్లి (Amniat-Melli) కి మధ్య జరిగిన సమావేశాన్ని బాబ్ వర్డ్ ఇలా  వివరించాడు:

 “500,000 డాలర్ల తో సమానమైన 100 డాలర్ల నోట్ల వున్నకట్టలను  గారీ, టేబుల్ మీద పెట్టాడు. మాములుగా ఇచ్చే 200,000 డాలర్ల కన్నా ఇది చాలా ఎక్జువ.... ఇదిగో మీ వెనక మేము వున్నాం, ఈ విషయంలో మేము పట్టుదలగా వున్నాం, ఇదిగో డబ్బు, మీకు డబ్బుతో  అవసరం వున్నదని మాకు తెలుసు అని బాగా నమ్మకంగా చెప్పటానికి ఈ ఎక్కువ మొత్తం పనిచేస్తుందని గారీ నమ్మాడు…. గారీ CIA హెడ్ క్వార్టర్స్ నుంచి డబ్బు అడిగిన, వెంటనే 

10 మిలియన్ డాలర్ల నగదును అందుకున్నాడు.” 

ముస్లిం ప్రపంచమంతటి నుంచి రిక్రూట్మెంట్లు చేసుకున్నారు. పాకిస్థానీ ఇంటలిజెంట్ వర్గాలు, CIA, బ్రిటన్ కు చెందిన M16 లు పాకిస్థాన్ లో నడుపుతున్న శిబిరాలలోఈ రిక్రూట్లకు ఆయుధశిక్షణ ఇచ్చారు. ఇంకా ఇతరులను న్యూయార్క్ లోని ఇస్లామిక్ కాలేజీ ఆఫ్ బ్రూక్లిన్ లో రిక్రూట్ చేసుకున్నారు. ఈ కాలేజి సెప్టెంబర్ 9 న కూలిన రెండుటవర్లకు  కనుచూపుమేరలోనే ఉన్నది. అలా రిక్రూట్ చేసుకున్న వారిలో సౌదీ అరేబియా ఇంజనీర్ అయిన ఒసామా బిన్ లాడెన్ ఒకడు. ఈ ఆపరేషన్ ఉద్దేశ్యం మధ్యఆసియాలో ఇస్లామిక్ ఛాందసవాదాన్ని విస్తరింపచేయటం, తద్వారా అంతిమంగా సోవియెట్ యూనియన్ ను నాశనం చేయటం. “ఆఫ్ఘానిస్తాన్లో  భావికాలంలో సాంఘిక ఆర్ధిక సంస్కరణలకు ఎటువంటి దెబ్బ తగిలినప్పటికీ PDPA ప్రభుత్వ పతనం అనేది అమెరికా ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది” అని కాబూల్లోని అమెరిక రాయబార కార్యాలయం 1979 ఆగస్టులో పేర్కొన్నది.

మళ్ళీ ఒకసారి నేను ఇటాలిక్స్ లో రాసిన దానిని చదవండి. తన పాపిష్టి ఉద్దేశ్యాన్ని ఇంత స్పష్టంగా వెలిబుచ్చటం ఎక్కువ సందర్భాలలో జరగలేదు. నిష్కళంక ప్రగతిశీల ఆఫ్ఘన్ ప్రభుత్వం, దానితోపాటు ఆఫ్ఘన్ మహిళల హక్కులు ఏట్లో కొట్టుకుపోవాలని అమెరికా చెప్పుకొచ్చింది.
ఆరు నెలల అనంతరం అమెరికా సృష్టించిన జీహాద్ ప్రమాదం తన ఇంటిముంగిటలొనే ఉండటంతో, దానికి ప్రతిచర్యగా సోవియెట్ యూనియన్ అత్యంత ప్రమాదకరమైన అడుగువేసింది.CIA అందించిన స్టింగర్ మిస్సలీలతో, “స్వాతంత్ర్య సమరయోధులు” అని మార్గరెట్ థాచర్ చే పొగిడించుకున్న ఉత్సాహంతో ముజాహిదీన్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎర్ర సైన్యాన్ని తోలేశారు.
తమకుతామే నార్తర్న్ అలియన్సు అని పిలుచుకుంటున్న ముజాహిద్దీన్లలో సాయుధముఠా నాయకులదే పెత్తనం. వీరి నియంత్రణ క్రిందనే మాదకద్రవ్యాల వ్యాపారం జరిగేది, గ్రామీణ ప్రాంత మహిళను భయకంపితులను చేసేదీ వీరే. తాలిబన్లు ‘మడిబట్టకట్టుకున్న’ శుద్ధ ఛాందసవాదులు. దీని నాయకులైన ముల్లాలు నల్లటి దుస్తులు వేసుకుని దొంగతనం, మానభంగం, హత్యలకు శిక్షలువేసిన వీరు ఆడవారిని మాత్రం బహిరంగజీవితం నుంచి పూర్తిగా బహిష్కరించారు.
1980 లలో రివల్యూషనరీ అసోసియేషన్ ఆఫ్ ది ఉమెన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్(RAWA) తో నాకు పరిచయం ఏర్పడింది. ఆఫ్ఘన్ మహిళల బాధలు ప్రపంచం దృష్టికి తీసుకు రావటానికి RAWA కృషి చేస్తున్నది. తాలిబాన్ల హయాంలో బురఖాల క్రింద కెమెరాలు అమర్చుకుని తాలిబాన్ల ఆకృత్యాలను రికార్డు చేసేవారు. పశ్చిమ దేశాల మద్దతుతో ముజహిద్దీన్లు చేసిన పాశవిక పాలనకు సాక్ష్యాన్ని వారు ఆ విధంగా బయటి ప్రపంచానికి తెలియచేశారు. “ఈ వీడియో టేపులన్నింటిని ప్రధానమైన అన్ని మీడియా సంస్థలకు అందించాము, కాని వారు వాటిని గురించి పట్టించుకోవాలనే అనుకోలేదు” అని RAWA కార్యకర్త “మరీనా” నాతో చెప్పింది.
1996 లో స్ఫూర్తివంతమైన PDPA ప్రభుత్వం తాలిబాన్ల చేతుల్లో కూలిపోయే పరిస్థితి వచ్చింది. ప్రధానమంత్రి నజీబుల్లా ఐక్యరాజ్యసమితి దగ్గరికి సహాయంకోసం వెళ్ళాడు. తిరిగి వచ్చిన నజీబుల్లాను వీధిదీపపు స్తంభానికి ఉరేసి హత్యచేశారు తాలిబాన్లు.
“ ప్రపంచాధిపత్యంకోసం గొప్పగా అడే ఆటగాళ్లకు ఈ దేశాలన్నీ చదరంగం బోర్డుమీద పావులు ” అని 1898 లో లార్డ్ కర్జన్ అన్నాడు.
ఇండియాకు వైస్రాయిగావున్న కర్జన్ ఆఫ్ఘనిస్తాన్ ను దృష్టిలో పెట్టుకునే ఈమాట అన్నాడు. ఒకశతాబ్దం తరువాత అవేమాటలను కొద్దితేడాతో ఇంగ్లాండ్ ప్రధాని టోనీ బ్లేయర్ కూడా అన్నాడు.
సెప్టెంబర్ 9 సంఘటన తరువాత “ఈ క్షణాన్ని మనం అధీనంలో ఉంచుకోవాలి. కలిడోస్కోప్ (Kaleidoscope) కదిలిపోయింది, ముక్కలు జారి పడుతున్నాయి. తొందరలోనే అవి తమతమ స్థానాల్లోకి సర్దుకుంటాయి. ఆలోపే, మన చుట్టూవున్న ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి” అని టోనీ బ్లేయర్ అన్నాడు.
ఆఫ్ఘన్ల విషయంలో ‘మీ దుర్భర దారిద్ర్యం నుండి మిమ్మల్ల్ని ఖచ్చితంగా కొంత అయినా కాపాడతాం’ అని కూడా అన్నాడు.
తనకు మార్గదర్శి లాంటి వాడైన అమెరికా ప్రెసిడెంట్ జార్జి బుష్ మాటలనే బ్లేయర్ పునరుద్ఘాటించాడు. ఒవెల్ ఆఫీసులో ఆఫ్ఘన్ బాంబు బాధితులతో మాట్లాడుతూ బుష్“ఆఫ్ఘనిస్తాన్లోని పీడితులు అమెరికా దాతృత్వం గురించి మున్ముందు తెలుసుకుంటారు. మేము సైనిక లక్ష్యలమీద దాడులు చేస్తూనే, మరోపక్క ఆకలితోనూ, కష్టాలతోను వున్నవారికి ఆహారము, మందులు జారవిడుస్తాం…”. అంటాడు.
ఇందులోని ప్రతిమాట పెద్ద అబద్ధం. వాళ్ళ ఆవేదనా ప్రకటనలుకూడా వంచనతో చేసినవే. పాశవిక పాశ్చాత్య సామ్రాజ్యవాద దేశాలలో “మనం” అనే మాటకు గుర్తింపు తక్కువ.
2001 వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ దిక్కులేనిదయింది. పాకిస్తాన్ నుంచి వచ్చే బాధితసహాయంపై ఆధారపడింది. జర్నలిస్ట్ జోనాధన్ స్టీలే చేపిన్నట్టు, 'ఈ దురాక్రమణ పరోక్షంగా 20 వేలమంది చావుకు కారణమయింది. కరువు బాధితులకోసం వచ్చే సరఫరాలు ఆగిపోయాయి. ప్రజలు ఇల్లు వదిలిపోయారు.'
18నెలల తరువాత కాబూల్ శిధిలాలలో పేలని అమెరిక బాంబు క్లస్టర్లను చూశాను. తరుచుగా ఇటువంటి వాటిని ఆకాశంనుంచి జారవిడిచిన సహాయ సామాగ్రి అని పొరపడటం జరిగేది. ఆకలితో అల్లాడే చిన్నారులు ఆహారంకోసం వెతుకులాడుతూ వీటిబారినపడి కాళ్ళుచేతులు పోగొట్టుకున్నారు.
బీబీ మారు అనే గ్రామలో ఒరిఫా అనే మహిళ తనభర్త సమాధి ముందు మోకరిల్లి ఉండటం చూశాను. ఆమె భర్త గుల్ అహ్మద్ కార్పెట్లు నేసేవాడు. అతను, అతనితో పాటు వారి 7గురు పిల్లలు, పక్కింట్లోని ఇద్దరు పిల్లలు మరణించారు.ఒకరోజు అమెరికావిమానం F-16 ఒకటి నీలాకాశంనుండి దూసుకొనివచ్చి ఒరిఫా పూరిగుడిసె పై 500 పౌండ్ల బరువుగల MK-82 బాంబును వేసింది. ఆ సమయంలో ఒరిఫా ఇంటిలో లేదు. తిరిగివచ్చి, చెల్లా చెదరైన శరీరావయాలను పోగుచేసుకున్నది.
ఆ తరువాత కొద్ది నెలలకు అమెరికన్ల బృందం ఒకటి కాబూల్ నుంచి వచ్చి ఆమె చేతికి మొత్తం 15 డాలర్లు ఉన్న ఎన్వలప్ కవరు ఇచ్చారు. “ఇది నా కుంటుంబంలో చనిపోయిన ఒక్కొక్కరికి రెండు డాలర్ల చొప్పున” అని చెప్పింది.
ఆఫ్ఘనిస్తాన్ మీద దండయాత్ర అనేది పెద్ద మోసం. 9/11 నేపధ్యంలో ఒసామా బిన్ లాడెన్ నుంచి దూరంగా ఉండాలని తాలిబాన్లు అనుకున్నారు. ఎన్నో రకాలుగా తాలిబాన్లు అమెరికాతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న క్లయింట్లు. అమెరికా ఆయిల్ కంపెనీల కన్సార్టియం 3 బిలియన్ డాలర్ల గ్యాస్ పైపులైన్ నిర్మించుకోవటానికి అనుమతి ఇవ్వటానికి బిల్ క్లింటన్ హయాంలో వరుసగా ఎన్నో రహస్య ఒప్పందాలు చేసుకున్నారు.
తాలిబాన్ నాయకులను అతిరహాస్యంగా అమెరికాకు ఆహ్వానించి Unocal కంపెని టెక్సాస్ భవనంలోనూ, CIA తన వర్జీనియా హెడ్ క్వార్టర్స్ లోనూ
వారికోసం విందులు, వినోదాలు ఏర్పాటు చేశారు. ఈ ఒప్పందాలు చేయించేవాడు డిక్ చెనీ. తరువాత కాలంలో ఈయనే జార్జ్ డబ్ల్యు బుష్ తో కలిసి వైస్-ప్రెసిడెంట్ అయ్యాడు.
ఆఫ్ఘనిస్తాన్ పౌరుల ఆధునికయుగపు కష్టాలకు మూలసూత్రధారి అయిన బిగ్నేవ్ బ్రేజేజిన్స్కి (Zbigniew Brezezinski) ని వాషింగ్టన్ లో ఇంటర్వ్యూ చేశాను. ఇది 2010లో జరిగింది.ఆఫ్ఘనిస్తాన్ వలలోకి సోవియట్ ను లాగిన తన గొప్పపధకాన్ని చెపుతూ, దీనివలన “కొద్ది మంది ముస్లింలు రెచ్చిపోవటం” జరిగింది అని తన స్వీయచరిత్రలో రాసిన విషయాన్నీ ఉటంకించి,
“దీనికి మీరేమన్నా పశ్చాత్తాపపడుతున్నారా?” అని అడిగాను.
“పశ్చాత్తాపమా? పశ్చాత్తాపం ఏమిటి ?” అన్నాడు.
కాబూల్ ఎయిర్ పోర్ట్ లోని బాధాకర దృశ్యాలు చూసినప్పుడు, సుదూరంగా వున్న టి వీ స్టూడియోలలో జర్నలిస్టుల, జనరల్స్ “మా రక్షణను” ఉపసంహరించాలని రోదనలు వింటున్నప్పుడు ఇటువంటి బాధలు మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ రాకుండా ఉండాలంటే గతకాలపు సత్యాన్ని శ్రద్ధతో వినే సమయం ఇదే కదా అనిపించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)