ససేమిరా!

Telugu Lo Computer
0

 

పూర్వం విశాల నగరాన్ని నందుడు అనే రాజు పరిపాలించే వాడు. అతడి కొడుకు జయంతుడు. ఇతడు దురహంకారి.  తప్పని మందలించిన వృద్ధ మంత్రి శతానందుడిని రాజ్యం నుండి బహిష్కరింపజేసాడు. ఒకసారి వేటకు వెళ్ళి అలిసిపోయి ఒక చెట్టు నీడన విశ్రమించాడు. ఇంతలో ఒక పులి గర్జిస్తూ తనవైపు రాగా జయంతుడు చెట్టెక్కాడు. కాని అప్పటికే ఆ చెట్టుపై ఒక ఎలుగు బంటి వున్నది. జయంతుడు వణికిపోతుండగా  ఆ ఎలుగు ధైర్యం చెప్పితన ఒడిలో నిద్రపుచ్చింది. పులి ఎలుగుబంటితో ఇలా అన్నది. 

   " చూడు ఎలుగూ! నరులు నీకూ నాకూ శత్రువులే! కనుక అతడిని క్రిందికి తోసివెయ్యి! నేనతణ్ని తృప్తిగా తిని పోతాను‌" 

ఎలుగుబంటి అన్నది. 

   "శరణన్నవాడిని శత్రువైనా కాపాడవలసినదే! అది ధర్మం కనుక ఈ మానవుణ్ణి నేను విడిచిపెట్టను."

   కొంతసేపటికి జయంతుడు నిద్ర లేచాడు. అప్పుడు అతడిని కాపు వుండమని చెప్పి ఎలుగుబంటి తాను నిద్రపోయింది. ఆ సమయంలో పులి జయంతునితో- 

"ఓ రాజకుమారా! నువ్వు ఈ భల్లూకాన్ని నమ్ముతున్నావా ? వెర్రి వాడా! అది నిన్ను తర్వాతనైనా చంపుతుంది. కాబట్టి విజ్ఞుడవై ఆలోచించి నిర్ణయం తీసుకో! అది నిద్రలో వున్నది. వెంటనే క్రిందికి తోసేయ్! దాన్ని తిని నేను నా దారిన పోతాను." అన్నది. జయంతుడు మంచిచెడ్డలు ఆలోచించకుండా తనను రక్షించిన ఆ భల్లూకాన్ని క్రిందికి నెట్టాడు. వెంటనే అది మేల్కొని ఒక కొమ్మ పట్టుకుని వ్రేలాడుతూ "దుర్మార్గుడా! నిన్ను రక్షించానన్న కృతజ్ఞత కూడా లేకుండా నన్నే చంపించ చూస్తావా ఫలితంగా మతిభ్రష్టుడవైసంచరించు అని శపించింది. ఆనాటినుండి అతడు మతిచెడి తిరగసాగాడు. ఎవరేమి అడిగినా 'ససేమిరా!' అన్నమాట తప్పితే మరోమాట పలుకలేక పోయేవాడు. అతడావిధంగా తిరుగుతూ ఒకసారి  రాజపరివారం కంటబడి తిరిగి  తన రాజ్యం చేరుకున్నాడు. తండ్రి కుమారుని స్థితికి చింతించి అనేక వైద్యులకు చూపించాడు. కాని ఫలితం కలగలేడు. ఒకసారి జయంతునిచే బహిష్క్రతుడైన వృద్ధ మంత్రి శతానందుడు మారువేషంలో రాజ్యసభకు వచ్చి జయంతుణ్ని పరీక్షించి విషయం అవగతం చేసుకున్నాడు. వెంటనే అతడు పదేపదే పలికే ' ససేమిరా' అనే అక్షరాలతో ప్రారంభిస్తూ నాలుగు శ్లోకాలతో ఆ ఎలుగుబంటి కథంతా చెప్పాడు. అది విన్న జయంతుడికి ఎలుగు శాపం తీరి మతిభ్రమ తొలగి సాధారణ మనిషి అయ్యాడు.

ఈ కథ 'మంచన' రచించిన 'కేయూరబాహు చరిత్ర' లోనిది. ఈ కథ ఆధారంగానే ' ససేమిరా'  అనే మాట సామెతగా వాడుకలోనికి వచ్చింది.


Post a Comment

0Comments

Post a Comment (0)