నాకు బూతులు రావా ?

Telugu Lo Computer
0


తాను వైసీపీ నేతలను రాష్ట్ర సమస్యల గురించి ప్రశ్నిస్తుంటే వాళ్లు తనను వ్యక్తిగతంగా నిందిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మంగళగిరిలో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ గ్రామసింహాలు అంటూ ప్రసంగం ప్రారంభించిన పవన్ కళ్యాణ్ వారిని వీధి కుక్కలు, పిచ్చికుక్కలతో పోల్చారు. వైసీపీ నేతలకు అన్నీ ఉన్నాయని కానీ భయం మాత్రం లేదని వ్యాఖ్యనించారు. వారికి భయం అంటే ఏంటో చూపిస్తానని అన్నారు. తన వ్యక్తిగత జీవితం బ్లాక్ అండ్ వైట్ అని వైసీపీ వారి జీవితాలు రంగులమయమని అన్నారు. తనపై బూతుపురాణం మొదలుపెట్టారని.. బాపట్లలో పుట్టిన తనకు బూతులు రావా ? అని ప్రశ్నించారు. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతానని హెచ్చరించారు. అయితే తాను ఎప్పుడూ సంస్కారం మరిచి మాట్లాడబోనని అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టే బూతులు మాట్లాడటం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఎక్కడుందని.. ఈ అంశం గురించి మాట్లాడే హక్కు తనకు ఉందని అన్నారు. ప్రతి సన్నాసితో తిట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని.. తనను ప్రేమించే లక్షలాది మంది కోసమే తాను ఇవన్నీ పడుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. తనను తిడితే బలహీనపడతానని అనుకుంటున్నారని.. కానీ తనను తిడితే మరింత బలపడతానని తెలిపారు. తాను తగ్గి మాట్లాడుతున్నానని అన్నారు. యుద్ధం మొదలుపెడితే తాను వెనకాడబోనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలందరికీ ప్రభుత్వం సొమ్మును సమానంగా ఇవ్వాలని.. తనకు ఓటు వేసిన వాళ్లకే పథకాలు, డబ్బులు ఇస్తామంటే చూస్తూ ఊరుకోవాలా ? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఎక్కువ చేయొద్దని.. గీత దాటితే తోలు తీస్తానని హెచ్చరించారు. సినిమా టికెట్లపై తాను ప్రశ్నిస్తే గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో తనకేమైనా సినిమా ధియేటర్లు ఉన్నాయా ? అని ప్రశ్నించారు. దౌర్జన్యం చేసిన వాళ్లు ఎవరైనా తమ శత్రువులే అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)