ప్రఖ్యాతి గాంచిన గణపతిఆలయాలు

Telugu Lo Computer
0


హిందూ సంప్రదాయంలో శ్రీ మహా గణపతి ఆది దేవుడుగా పూజలందుకుంటాడు. విఘ్న వినాయకుడుగా పేరొందిన గణపతి ఆరాధన అత్యంత ప్రాచీనమైనదిగా పేర్కొనవచ్చు. మన దేశమంతటా గణనాధుడు, గణేశుడు, వక్రదంతుడు. విఘ్నేశ్వరుడు, గజాననుడు, ఏకదంతుడు,వక్రతుండుడు ఇలా రకరకాల పేర్లతో పూజలందుకుంటున్నాడు. అన్ని శివాలయాల్లో వినాయకుడికి ఉపాలయాలుంటాయి. పౌరాణికంగా చారిత్రకంగా గణపతికి ప్రత్యేక ఆలయాలు నిర్మితమయ్యాయి. మన తెలుగునాట కూడా అనేక వినాయక ఆలయాలున్నాయి. ఇలాంటి సుప్రసిద్ధ ఆలయాన్ని ఒక్కసారి పరికిద్దాం.

కాణిపాకం

చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక క్షేత్రం ఎంతో సుప్రసిద్ధమైంది. ఈ క్షేత్రాన్ని పూర్వం విహారపురి అని పలిచేవారు. 11వ  శతాబ్దంలో కుళోత్తుంగ చోళుడు బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం వినాయక ఆలయం కట్టించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. 1336లో విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. బహుదా నది ఒడ్డున ఉన్న ఈ విఘ్నేశ్వరుడు స్వయంభువుగా సాక్షాత్కరించారు. ఈ స్వామికి ఏటా వినాయక చవితి సందర్భంగా 21 రోజులపాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా చేస్తారు.

బిక్కవోలు గణపతి

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో నెలకొని ఉన్న గణపతి ఆలయం అత్యంత పురాతనమైంది. ఇక్కడ స్వయంభువుగా వెలసిన గణపతి సుమారు ఏడడుగుల ఎత్తు కలిగి ఉంటాడు. ఇక్కడి గణపతి ఆశీనావస్థలో దర్శనమిస్తాడు. మహారాజ ఠీవి ఉట్టిపడేలా గణపతి కొద్దిగా వెనుకకు వంగి ఆశీనులైనట్లు ఉంటాడు. ఈ గణపతి ఏటేటా పెరుగుతూ ఉంటాడని చెబుతున్నారు. గతంలో స్వామి వారికి చేయించిన వెండి తొడుగు ప్రస్తుతం చాలకుండా పోతుండడం స్వామివారు పెరుగుతున్నారనేందుకు నిదర్శనంగా చెబుతారు. గణపతి చెవిలో భక్తులు తమ కోర్కెలు, కష్టాలు విన్నవించుకోవడం ఈ ఆలయం ప్రత్యేకత.

కొలనుపాక గణపతి

నల్గొండ జిల్లా కొలనుపాక గణపతి ఆలయం వీరశైవ మతానికి సంబంధించిన గొప్ప చారిత్రక ప్రదేశం. ఇక్కడి గణపతి విగ్రహం చాళుక్యుల శిల్పకలా శైలితో కూడినది. చుతుర్భుజాలతో పీఠంపై ఆశీనుడైనట్లుగా ఇక్కడి వినాయకుడు భక్తులకు దర్శనమిస్తాడు.

అయినవిల్లి ఆలయం

తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చేరువలో ఉన్న అయినవిల్లి సిద్ధివినాయక ఆలయం అత్యంత పురాతనమైనది. పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని తొలుత దేవతలు నిర్మించారని స్థల పురాణ గాథ.. దక్ష ప్రజాపతి దాక్షారామంలో యజ్ఞం నిర్వహించే ముందు అయినవిల్లి వినాయకుని పూజించి పునీతుడైనట్లు క్షేత్ర పురాణం. భక్తులు 1,116 కొబ్బరికాయలతో స్వామివారికి అభిషేకం చేయించి మొక్కులు చెల్లించుకుంటారు.

చోడవరం స్వయంభూ వినాయక ఆలయం

విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఉన్న గౌరీశ్వరాలయం, వినాయక ఆలయాలకు స్వయంభువులు గా వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని గర్భగుడి ద్వారంపై ఉన్న చేప గుర్తుల వల్ల ఇక్కడి స్వామివారిని మత్స్యగణపతిగా పేర్కొంటారు. ఈ వినాయకుడు చిన్నపాటి నీటి ఊటలో నల్లని రాతి విగ్రహంగా కనిపిస్తాడు. మూడడుగులకు పైగా పొడవు, వెడల్పులతో , ఛాతీభాగం వరకే స్వామివారు దర్శనమిస్తారు. మిగతా భాగం భూమి లోపలే ఉండడం విశేషం. తొండం చివరి భాగం కనిపించదు. వినాయక విగ్రహాన్ని గౌరీశ్వరాలయానికి తరలించడానికి తవ్వకం జరపగా తొండం చివర కనిపించకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు.

రాయదుర్గం దశభుజ శ్రీ మహాగణపతి

అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో మూడు గణపతి ఆలయాలున్నాయి. వాటిలో రాయదుర్గం కొండపైకి వెళ్లే మార్గంలో కోట మెట్ల కింద ఆత్మకూరు వీధిలో ఉన్న దశభుజ గణపతి ఆలయం  ప్రముఖమైంది. 4 మీటర్ల కొండరాయిపై మలచిన వినాయకుని రూపం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. సుమారు 15 అడుగుల ఎత్తైన రూపంలో పది చేతులు గల వినాయకుడిని ఎంతో నేర్పుగా మలిచారు. ఈ విగ్రహంలో వినాయకుడి తొండం కుడి వైపు తిరిగి ఉంటుంది. కూర్చుని ఉన్న వినాయకుడి ఎడమ తొడపై ఒక స్త్రీ  రూపం కనిపిస్తుంది.

సంకష్టహరసిద్ధి విద్యాగణపతి ఆలయం

మెదక్‌ జిల్లా పటాన్‌ చెరుకు అతి చేరువలోని రుద్రారంలో స్వయంభువుగా వెలసిన శ్రీ సంకష్టహరసిద్ధి విద్యాగణపతి ఆలయం ఉంది. వందల ఏళ్లనాటి ఈ ఆలయం భక్తులకు కొంగుబంగారం. ఇక్కడి స్వామి విగ్రహంపై ఉదరంతోపాటు చేతులకు కూడా నాగబంధం ఉండడం విశేషం. ఈ వినాయకుడిపై శ్రీ చక్ర బీజాక్షరాలు ఉండడంతో ఆ శక్తిని సామాన్యులు తట్టుకోవడానికి వీలుగా స్వామివారికి ర రోజూ సింధూర లేపనం చేస్తారు. ఇక్కడి స్వామి విద్యాగణపతి కూడా కావడంతో అనేక మంది స్వామివారికి ప్రదక్షిణలు చేసి, దర్శించుకుని విద్యా సముపార్జన చేస్తుంటారు.

సికింద్రాబాద్‌ గణపతి ఆలయం

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న గణపతి ఆలయం బహు ప్రసిద్ధమైనది. పూర్వం సైనిక నివాస ప్రాంతంగా ఉన్న ఈ స్థలంలో 1824లో సైనికులు మంచినీటి కోసం బావి తవ్వగా వినాయక విగ్రహం బయటపడింది. కంచి మఠం వారిచే విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఈ  ఆలయం జంటనగరాలలో అత్యంత మహిమాన్వితమైనదిగా పేరుగాంచింది.

విశాఖ సంపత్‌ వినాయక ఆలయం

విశాఖపట్నం నుంచి సిరిపురం వెళ్లేదారిలో శ్రీ సంబంధం అండ్‌ కంపెనీ వారి కార్యాలయ ప్రాంగణంలో 1962లో వినాయకుడిని ప్రతిష్టించారు. అప్పుడు ఆ కార్యాలయ యాజమాన్యం పూజలు చేస్తుండేది. తర్వాతి కాలంలో ఇతరులనూ దర్శనానికి అనుమతించారు. 1967లో కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఈ ఆలయంలో గణపతి యంత్రం అమర్చారు. విశాఖ సంపత్‌ వినాయకుడిని రోజూ వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే వినాయకుడు గా ఈయన భక్తుల కొంగు బంగారమయ్యాడు.

కాజీపేట శ్వేతార్కమూల గణపతి ఆలయం

వరంగల్‌ జిల్లా కాజీపేట రైల్వే దేవాలయ ప్రాంగణంలో శ్వేతార్కమూల గణపతి ఆలయం ఉంది. ఇక్కడి వినాయక మూర్తి తెల్లజిల్లేడు వేరు మొదలు నుంచి ఉద్భవించింది. ఈ విగ్రహాన్ని చెక్కడం కాని, మలచడం కానీ చేయలేదు. స్వయంగా భూమి నుంచి పుట్టిన శ్వేతార్క గణపతికి నేత్రాలు, నుదురు, మోచేయి, అరచేయి, సుఖాసనం, తల్పం, అన్ని స్పష్టంగా కనబడతాయి. నారద పురాణంలో తెల్లజిల్లేడు వందేళ్లు పెరిగితే ఆ వృక్షమూలంలో గణపతి రూపం తయారవుతుందని చెప్పారు. ఈ ఆలయంలో మూలమూర్తి పురాణ వచనానికి తగినట్లుగా కనిపిస్తున్నాడు.

🍃ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం పరమ పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. 

🍃యానాంలో వెలసిన సిద్ధ గణపతి (పిళ్లైయార్‌) నమ్మిన భక్తులకు కోరిన కోర్కెలు తీరుస్తూ అనుగ్రహిస్తున్నాడు.

🍃శ్రీ కాళహస్తీశ్వరాలయ ప్రాంగణంలోను ఆలయ కుడ్యములపై స్తంభముల మీద పెక్కు భంగుల గణపతిమూర్తులు కనిపిస్తాయి. ఆవరణంలోని పాతాళ గణపతి ఆలయం యాత్రికులను అమితంగా ఆకర్షిస్తుంది. స్వామి ఆలయ ద్వారానికి దక్షిణాన గల గూటిలో ఒక గణపతి మూర్తి ఉన్నది. ఇరువైపుల కుమారస్వామి, వినాయకుల శిల్పములు చెక్క బడ్డాయి. ప్రధాన ఆలయానికి ముందున్న మందిరంలో నిలుచున్న గణపతి విగ్రహం ఉన్నది. శిలాముఖముపైనున్న పెక్కు మూర్తులలో నృత్త గణపతిమూర్తి ఉన్నది. ప్రధానాలయములో వల్లభ గణపతి, మహాలక్ష్మీ గణపతి మూర్తులున్నాయి.

🍃రేణిగుంటకు సమీపమున గల గుడిమల్లంలోని పరశు కామేశ్వరాలయంలో నృత్తగణపతి విగ్రహం ఉన్నది. 

🍃పుంగనూరు సమీపమున గల లద్దిగంలోని ఇరుంగళేశ్వర దేవాలయ ఆవరణంలోను, తొండమనాడులోని ఆదిత్యేశ్వరాలయంలోను నిలుచున్న గణపతి విగ్రహాలున్నాయి.

🍃నెల్లూరులోని మూలస్థానేశ్వరాలయం లోపలి ఆవరణంలో దక్షిణాన గణపతి మందిరం ఉన్నది.

🍃భద్రాచల కోదండ రామ స్వామి ఆలయ పరిసరాలలో ఉన్న 35 దేవాలయాలలో గణపతి మందిరం కూడా ఉంది.

🍃దాక్షారామ భీమేశ్వరాలయ ఆవరణంలో తూర్పున ఉన్న గోపురానికి సమీపంలో ఒక గణపతి విగ్రహం ఉన్నది.

🍃అరసవల్లి సూర్య దేవాలయము లో ఒక గణపతి మూర్తి ఉన్నది.

🍃విజయవాడకు ఈశాన్యముగ ఉన్న పర్వతగుహలలో ఒక దానియందు గణపతి మూర్తి ఉన్నది. 

🍃వేములవాడలోని రాజరాజేశ్వరాలయంలోని లక్ష్మీగణపతి విగ్రహం విశిష్టమైనది.

🍃మెదక్ జిల్లా పాలంచేరు వద్ద రాష్ట్రకూటుల కాలం నాటి పెక్కు ఆలయ శిథిలాలున్నాయి. ఇచటి ద్విభుజ, చతుర్భుజ గణపతి మూర్తులు మూడు ఉన్నాయి.

🍃శిల్పకళా ఖండాలకు ప్రశస్తిగాంచిన నందికందిలోని రామేశ్వరాలయంలో అనేక నృత్తగణపతి శిల్పాలు యూన్నాయి. కొండిపర్తి, గాణగాపురం, పానగల్, పాలంపేట హనుమకొండలలో అనేక చతుర్భుజ గణపతి విగ్రహాలున్నాయి.

🍃హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయ ప్రాంగణంలోని దక్షిణ కుడ్యముపై అత్యంత సుందరమైన గణపతి శిల్పం ఉన్నది. కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో వరంగల్లు సమీపాన వందలాది దేవాలయాలు నిర్మింపబడ్డాయి. 50 గణపతి దేవాలయాలు కట్టించినట్లు చరిత్ర తెలుపుతోంది. 

🍃జహీరాబాద్ సమీపాన గల రేజంతలలో గణపతి ఆలయం కొండల మధ్య ఉన్నది. ఈ గణపతి స్వయంభువని ప్రతీతి.

🍃మహబూబ్‌నగర్ జిల్లా అలంపురంలోని బ్రహ్మేశ్వరాలయంలో గోడపై విశిష్టమైన గణపతి విగ్రహ మొకటి కనిపిస్తుంది. ఈ విగ్రహం చెక్కినది కాదని విశ్వాసం. గండ్ర ఇసుకతో పసరులను కలిపి రససిద్ధుడైన శిల్పి ఒకడు ఈ వినాయకుని తయారు చేసినట్లు చెబుతారు. ఈ వినాయకుని రససిద్ధి వినాయకుడంటారు. ఈ విగ్రహం చూడటానికి చాలా నునుపుగా కనపడ్డప్పటికీ తాకితే గరుకుగా ఉంటుందని చెబుతారు.

Post a Comment

0Comments

Post a Comment (0)