కులం ప్రాణం తీసింది !

Telugu Lo Computer
0


సూర్యాపేట పట్టణ పరిధిలోని సుందరయ్యనగర్‌కు చెందిన నాగమణి (24), సమీపంలోని దుబ్బతండాకు చెందిన ధరవత్‌ నెహ్రూ(28)లు కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. నెహ్రూ స్థానికంగా మేస్త్రీగా పని చేస్తున్నాడు. నాగమణి ఇటీవలే నర్సింగ్‌ పూర్తిచేసి హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తోంది. ఓ రోజు వారి ప్రేమ వ్యవహారాన్ని వారి వారి కుటుంబ సభ్యుల ముందు ఉంచారు. అయితే.. నాగమణి తల్లిదండ్రులు మాత్రం ప్రేమ పెండ్లికి నిరాకరించారు. అనంతరం ఆమెకు మరో వ్యక్తితో వివాహం చేసేందుకు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న నెహ్రూ మనస్తాపం చెంది తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. అతడు చనిపోయాడన్న వార్త విన్న నాగమణి కూడా అదే రోజు హైదరాబాద్ లోని హఫీజ్‌పేట్‌- చందానగర్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నాగమణిగా గుర్తించి ఆమె కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆమె మృతదేహన్ని సుందరయ్యనగర్‌కు ఆదివారం తీసుకొచ్చారు. నాగమణి మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు నాంపల్లి రైల్వే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతోనే పెండ్లికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. కులం ఇద్దరి ప్రాణం తీసిందని పలువురు వాపోతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)