అక్టోబర్‌ 1 నుండి దుబాయ్‌ ఎక్స్‌పో

Telugu Lo Computer
0


దుబాయ్ ఎక్స్‌పో 2020 ప్రారంభానికి మరో 3 రోజులే మిగిలి ఉన్నాయి. ఈ ఎక్స్‌పో అక్టోబర్‌ 1 న ప్రారంభమై.. వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగనున్నది. దుబాయ్-అబుదాబి నగరాల మధ్య ఈ ఎక్స్‌పో జరుగనున్నది. ప్రతిరోజూ 60 షోలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో 191 కంట్రీ పెవిలియన్‌లు ఉన్నాయి. అలాగే 200 కంటే ఎక్కువ రెస్టారెంట్‌లు సిద్ధం చేశారు. ఎక్స్‌పోను సందర్శించాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు రోజుల సెలవును మంజూరు చేస్తూ యూఏఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 6 నెలల పాటు కొనసాగే ఈ ఈవెంట్‌కు వచ్చే 1.7 కోట్ల మందికి స్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. దుబాయ్‌ ఎక్స్‌పో కారణంగా మార్కెట్‌లో భిన్నమైన ఉత్సాహం కనిపిస్తున్నది. ఈ ఎక్స్‌పోకు ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది వస్తారని అంచనా. ఇందులో 1.7 కోట్ల మంది విదేశీయులు ఉంటారని భావిస్తున్నారు. ఈ ఈవెంట్ అంతా అనుకున్నట్టుగా జరిగితే, యూఏఈకి దాదాపు రూ.1.3 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని నిపుణులు లెక్కలు వేస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా దుబాయ్‌లోని హోటల్‌, విమానయానం, ప్రయాణ రంగాలు కుదేలైపోయాయి. ఎంతో నష్టపోయాయి. అయితే, ఈ ఎక్స్‌పో నిర్వహణతో ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చని ఆశిస్తున్నారు. జనవరి నుంచి జూలై వరకు యూఏఈకి 30 లక్షల మంది పర్యాటకులు వచ్చారు. హోటల్స్, టూరిజం సంస్థలు 2021 తొలి ఆర్నెళ్లలో 80 లక్షల మంది  అతిథులను ఆకర్షించాయి. 2020 ప్రథమార్థంతో పోలిస్తే ఇది 15 శాతం పెరుగుదలగా ఉన్నది. హోటల్ పరిశ్రమలో ఆదాయ వృద్ధి 31 శాతంగా ఉన్నది. వ్యాపారానికి ఊతమివ్వడానికి పర్యాటకుల కోసం పలు ఏర్పాట్లు చేశారు. రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ రూ.300 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇందులో మెట్రో స్టేషన్లు, 50 మెట్రో రైళ్ల సేకరణ, 9 ఫ్లై ఓవర్లతో 138 లేన్ కిమీ రోడ్ల నిర్మాణం ఉన్నాయి. 18 స్టేషన్లు, 15,000 టాక్సీలు యూఏఈ నగరాలను కనెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంచారు. సైట్ నిర్మాణంలో 80 శాతం ప్రస్తుతం ఉపయోగంలో ఉన్నది. రియల్ ఎస్టేట్, విద్య, పర్యాటకం, రవాణా, లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అధునాతన సాంకేతికతపై దృష్టి కేంద్రీకరించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)