ఖడ్గ తిక్కన

Telugu Lo Computer
0

 

మనుమసిద్ధి ఆస్థానం లో కవి తిక్కన కాక సైన్యం లో మరో తిక్కన వుండేవాడు.అతన్ని ఖడ్గ తిక్కన అనేవారు. పాట కూడా వుంది కదా కలం తిక్కనా ఖడ్గ తిక్కనా గణపతి దేవుడు మన వాడోయ్.అని. ఒకసారి యుద్ధం లో పోరాడడానికి ఖడ్గ తిక్కన వెళ్ళాడు. యుద్ధం లో తన సైనికులందరూ చనిపోతున్నారు. శత్రు రాజులదే విజయ మనేట్టుగా వుంది పరిస్థితి.అప్పుడు తన ప్రాణాలను రక్షించు కుందామని యుద్ధం నుంచి పారిపోయి యింటికి వచ్చాడు. తిక్కన.యింట్లోకి వెళ్ళగానే భార్య ఎదురొచ్చింది.స్నానం చేసి వస్తానని పెరట్లోకి వెళ్లబోతుంటే ఆవిడ యిక్కడే చేయండి అని ఒక మూలన నులకమంచం అడ్డం పెట్టి దానిమీద చీర ఒకటి కప్పిఅక్కడ పసుపు ముద్ద పెట్టింది.యిదేమిటి? అని కోపంగా అడిగాడు. తిక్కన.అప్పుడు ఆవిడ

పగరకు వెన్నిచ్చినచో 

నగరే మగతనంపు నాయకులెందున్ 

ముగు రాడువార మైతిమి 

వగ పేటికి జలకమాడ వచ్చిన చోటన్ 

అర్థము:--శత్రువులకు వెన్ను చూపి యుద్ధం చేయకుండా తిరిగి వస్తే మగతనపు నాయకులందరూ నవ్వరా?నేవు,నేను,మీ అమ్మ ముగ్గురు ఆడవాళ్ళ మైనాము కదా!ఇంకెందుకు  యింట్లోనే స్నానం చేసేందుకు ఆలోచిస్తావు?

ఆ కాలం లో యింట్లో ఒక మూల తూము,చిన్నగట్టు కట్టి అక్కడ ఒకనులక మంచము అడ్డం పెట్టుకొని దానిమీద చీర వేసిఆడవాళ్ళు అక్కడే స్నానం చేసేవారు.అప్పుడు ఆడవాళ్ళు పసుపు పూసుకొని స్నానం చేసే వారు.(యిప్పటికీ పల్లెటూళ్ళల్లోముత్తైదువు లైన ఆడవాళ్ళు పసుపు పూసుకోనిదే స్నానం చెయ్యరు.మా అమ్మమ్మ పసుపు లేనిదే స్నానం చేసేవారు కాదు)...మగవాళ్ళు పెరట్లో నూతి దగ్గర స్నానం చేసే వాళ్ళు.

ఈ భార్య లింతేలే.అనుకుంటూ పెరట్లోకి వెళ్లి నూతి దగ్గర స్నానం చేసి వంటింటి లోకి వెళ్లి అమ్మా నాకు అన్నం పెట్టు అన్నాడు.ఆమె మౌనంగా వడ్డించింది. ఆఖరికి పెరుగు వెయ్యమ్మా అన్నాడు తిక్కన అప్పుడు ఆమె పెరుగు బదులు విరిగిన పాలు పోసింది.యిదేమిటి విరిగిన పాలు పోశావు?అని అడిగాడు తిక్కన.అప్పుడు ఆవిడ

ఆసదృశము గ నరి వీరుల 

మసి పుచ్చక తిరిగి వచ్చు మగపంద క్రియన్ 

కసవున్ మేయగ బోయిన 

పసులున్ విరిగినవి తిక్క పాలున్ విరిగెన్ అనిందట

అర్థము:--నీకు సాటి ఎవ్వరూ లేనట్టుగాయుద్ధం చేసి శత్రువులను చంపకుండా పిరికిపంద లాగా తిరిగి వచ్చినావు.

అలాగే గడ్డి మేసి వచ్చిన ఆవులు కూడా విరిగినపాలే యిచ్చినాయి

ఆ మాటలకు  తిక్కన సిగ్గుపడి తిరిగి యుద్ధానికి వెళ్లి వీరస్వర్గం అలంకరించాడు(అప్పటి ఆడవాళ్ళు అంత దేశభక్తి,రాజ భక్తీ కలవారు)..ఆ సంగతి యింకా అతని భార్యకు తెలీదు.ఆ దినమే అక్కడికి వేములవాడ భీమకవి వచ్చాడు.ఆయనను చూసేందుకు తిక్కన భార్య వెళ్లి ఆయన కాళ్ళకు నమస్కారం చేసిందట.ఆయన దీర్ఘ సుమంగళీ భవ అని దీవించాడట.అప్పుడు అక్కడ వున్న ఆయన శిష్యుడు అదేమిటి స్వామీ! అలా ఆశీర్వదించారు?ఆవిడ భర్త యుద్ధం లో చనిపోయాడు కదా!అన్నాడట.అప్పుడు భీమకవి అలాగా నాకు తెలీదు అని నా ఆశీర్వాదం అబద్ధం కాకూడ దని భీమేశ్వరుడిని ధ్యానించగా తిక్కన తలా మొండెము యుద్ధభూమి నించి యెగిరి వచ్చి అక్కడికి రాగానే అతుక్కున్నా యట.తిక్కన పునర్జీవితు డయ్యాడని ఒక కథనం.అదెంతవరకు నిజమో తెలీదు. .కానీ భీమకవి ఏది చెప్తే అది జరిగేదనేది మాత్రం సత్యం. .

Post a Comment

0Comments

Post a Comment (0)