టంగుటూరి ప్రకాశం పంతులు

Telugu Lo Computer
0



టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధులు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకరు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారు.మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవారు. 

టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించారు.ఆరుగురు సంతానంలో ప్రకాశం ఒకరు. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరి లో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామ కరణం వృత్తిలో ఉండేది. ఆయన ముత్తాత టంగుటూరులో కరణీకం చేస్తూ ఉండేవారు. ఆయనకు అప్పాస్వామి, నరసరాజు అనే ఇద్దరు కుమారులు. ఆయన ముత్తాత అనంతరం అప్పాస్వామిలో టంగుటూరులో కరణీకం చేసేవిధంగా ఆయన తమ్ముడు నరసరాజు టంగుటూరికి దగ్గర్లో ఉన్న వల్లూరులో కరణీకం చేసేట్లుగా నిర్ణయించారు. ఆయనే ప్రకాశం తాతగారు. ఆయనకు నలుగురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు. వారిలో ఆఖరి వాడైన గోపాలకృష్ణయ్యకు ప్రకాశం సంతానంగా జన్మించారు.ఆయన పదకొండోయేట తండ్రి మరణించడంతో పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసే వారిని సమాజంలో చాలా తేలికగా చూసేవారు. పూటకూళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరారు. పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవారు. తెల్లగా అందంగా ఉండడంతో ఆడ మగ రెండు వేషాలు కూడా వేసేవారు. ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవారు. క్రికెట్ చాలా చక్కగా ఆడేవారు. ఆ వయసులో అల్లరిగా తిరిగేవారు. వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. అల్లరి చిల్లరి సావాసాల వల్ల నాటకాల వ్యాపకం వల్లా ప్రకాశానికి మెట్రిక్ పాస్ అవడం కష్టమయ్యింది. మిషను పాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు చలవతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ లో చదివారు. నాయుడు రాజమండ్రికి నివాసం మారుస్తూ ప్రకాశాన్ని తనతో తీసుకువెళ్ళి అక్కడ ఎఫ్.ఏ.లో చేర్పించారు. తరువాత మద్రాసుకు పంపించి న్యాయశాస్త్రం చదివించారు. ప్రకాశం 1890లో తన అక్క కూతురైన హనుమాయమ్మను పెళ్ళి చేసుకున్నారు. ఆ తరువాత కొద్దికాలం పాటు ఒంగోలులో న్యాయవాద వృత్తి చేసి 1894లో మళ్ళీ రాజమండ్రి చేరారు. వృత్తిలో బాగా పేరూ, పుష్కలంగా డబ్బు సంపాదించారు. తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యారు. 

ప్రకాశం అప్పట్లో ప్రకాశం సెకండ్ గ్రేడ్ ప్లీడరు. కనుక పై స్థాయి కోర్టులలో వాదించడానికి అర్హత లేదు. బారిస్టరులకు మాత్రమే ఆ అర్హత ఉండేది. ఒకమారు ప్రకాశం ప్రతిభ గమనించిన ఒక బారిస్టరు ప్రకాశాన్ని కూడా బారిస్టరు అవమని ప్రోత్సహించారు.ఆ సలహా నచ్చి ప్రకాశం 1904లో ఇంగ్లాండు వెళ్ళారు. వెళ్ళే ముందు మహాత్మా గాంధీ లాగానే మద్యం మాంసం పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చారు. దీక్షగా చదివి బారిస్టరు అయ్యారు. అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాభాయి నౌరోజీ బ్రిటీషు పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలు పంచుకొన్నారు. ఈ సమయంలో ప్రకాశానికి జాతీయ భావాలు సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి. 1907 లో లండనులో ప్రశంసా పత్రంతో బారిష్టరు కోర్సు పూర్తిచేసుకొని భారతదేశం తిరిగి వచ్చాక ప్రకాశం మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందిన బారిష్టరులందరూ ఆంగ్లేయులు లేదా తమిళులు. పేరు పొందిన తెలుగు బారిష్టరులలో ఈయనే ప్రప్రథముడు. ప్రకాశం పౌర నేర వ్యాజ్యాలనన్నింటినీ చేపట్టేవారు.ఈయన చేపట్టిన క్రిమినల్ కేసుల్లో ఆష్ హత్యకేసు ఒక ప్రసిద్ధిచెందిన కేసు. తిరునెల్వేలిలో కలెక్టరుగా పనిచేస్తున్న ఆష్ 1907లో కాల్చిచంపబడ్డారు. ఈ సంఘటన బెంగాల్ కు  చెందిన జాతీయవాద నేత బిపిన్ చంద్ర పాల్ ఆ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తున్న సమయములో జరిగింది. ప్రకాశం ఈ హత్య కేసులో ఒక ముద్దాయి తరఫున వాదించి ఆయనకు స్వల్పశిక్ష పడేటట్టు చేశారు. ప్రకాశం లా టైమ్స్ అనే న్యాయవాద పత్రికకు కూడా సంపాదకత్వం వహించేవారు. అదే సంవత్సరం బ్రిటిషు ప్రభుత్వం పాల్ ప్రసంగాలు రాజద్రోహాన్ని ఉసిగొల్పేవిగా ఉద్రేకపూరితముగా ఉన్నవని భావించటం వలన ఇతరులు ముందుకు రావటానికి భయపడే సమయంలో ఈయన బిపిన్ చంద్ర పాల్ ఇచ్చిన ప్రసంగాలకు హాజరయ్యేవారు. లక్నో ఒడంబడిక తర్వాత ప్రకాశం కాంగ్రెసు పార్టీ మీటింగులకు తరచుగా హాజరు కావటం ప్రారంభించి 1921 అక్టోబరులో సత్యాగ్రహ ప్రతినపై సంతకం చేశారు. స్వాతంత్ర్య సమరంలో అడుగుపెట్టి వృత్తిని వదలిపెట్టే నాటికి లక్షల్లో సంపాదించారు. ఆ యావదాస్తినీ దేశసేవకే ఖర్చు చేసారు. లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు తెలుగు తమిళ భాషలలో ఏకకాలమున విడుదలవుతున్న స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టారు. ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపారు.  1921 డిసెంబర్‌లో జరిగిన అహమ్మదాబాదు సదస్సులో కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. ఏదైనా అలజడి కానీ కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటించేవారు. ఈయన అకాలీ సత్యాగ్రహమప్పుడు పంజాబ్ ప్రాంతంలో హిందూ-ముస్లిం ఘర్షణలు తలెత్తినపుడు ముల్తాన్ లోనూ పర్యటించారు. కేరళలో మోప్లా తిరుగుబాటు సమయములో బయటి ప్రాంతాల వారిపై నిషేధం విధించినా లెక్కచేయకుండా ఆ ప్రాంతాన్ని పర్యటించి పర్యవసానంగా ఊటీ లోని తన ఆస్తిని ప్రభుత్వానికి కోల్పోయారు. 1922 లో సహాయనిరాకరణోద్యమం సందర్భంగా గుంటూరులో 30,000 మంది స్వచ్ఛందకులతో ఒక ప్రదర్శనను నిర్వహించారు. 1926 లో కేంద్ర శాసనసభకు కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా ఎన్నికైనారు. అక్కడ విఠల్‌భాయి పటేల్ మదన్ మోహన్ మాలవ్యా జిన్నా జి.డి.బిర్లా వంటి జాతీయ నాయకులు ప్రకాశం సహచరులు. 1921 లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1921 అక్టోబర్ 29 న స్వరాజ్య అనే 

దినపత్రికను ప్రారంభించారు. కొద్ది కాలంలోనే ఈ పత్రిక మంచి ఆదరణ చూరగొన్నది. దీని తెలుగు తమిళ సంచికలకు ప్రజలు ఎగబడ్డారు. 1928లో మద్రాసులో సైమన్‌ కమిషను బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తుపాకికి ఎదురు నిలిచి కాల్చమని సవాలు చేసారు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు. 1937 లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చినపుడు రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవిన్యూమంత్రి అయ్యారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 1946 లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై 13 నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు.స్వంత పార్టీలోని అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వం బలయ్యాక పార్టీ నుండి బయటకు వచ్చి స్వంతంగా ప్రజాపార్టీని స్థాపించారు. సైమన్ కమీషను వెళ్లినచోటల్లా నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు స్వాగతం పలికాయి. 1928, మార్చి 2న కమీషన్ బొంబాయిలో అడుగుపెట్టినపుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలను అనుమతించలేదు. అయితే ప్యారీస్ కార్నర్ వద్ద మద్రాసు హైకోర్టు సమీపములో మూక విపరీతముగా పెరిగిపోయింది. వాళ్లను చెల్లాచెదురు చేయటానికి పోలీసులు కాల్పులు జరిపారు. పార్థ సారథి అనే యువకుడు కాల్పులకు గురై అక్కడికక్కడే మరణించాడు. ఆ యువకుని మృతదేహాన్ని సమీపించిన వారెవరినైనా కాల్చుతామని పోలీసులు హెచ్చరించారు. దీనిపై కోపోద్రిక్తుడైన ప్రకాశం తన చొక్కా చించి కాల్చమని  ధైర్యంగా రొమ్ము చూపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)