తెలుగు భాషా - తంజావూరు

Telugu Lo Computer
0



గొప్ప అనేది సాపేక్ష పదం. అది గొప్పది అని చెప్పాలంటే దేనికన్నా గొప్పదో పోల్చి చెప్పవలసి ఉంటుంది. ఈ పోల్చి చూడటం వలన అనేక గొప్ప విషయాలు వెలుగులోకి వస్తాయి. లోటుపాట్లు అర్ధం అవుతాయి. నేర్చుకున్న పాఠాలను అన్వయించుకుంటే అభివృద్ధి సుస్థిరం అవుతుంది. తమిళ, తెలుగు భాషా సంస్కృతుల తులనాత్మక అధ్యయనం వలన ఒకే రాజుల ఏలుబడిలో అనేక చారిత్రక యుగాలు గడిపిన ఇరుగు పొరుగు ప్రజల జీవన వ్యవస్థలకు మూలాలు అర్ధం అవుతాయి. ఈ అధ్యయనం శాస్త్రీయమైన రీతిలో అంకిత భావంతో జరగవలసి ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలో 40% మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. వారిలో తాము తెలుగు వారిమని మరిచిన వారున్నారు, తమ మూలాలు తెలుగే గానీ, తాము మాత్ర౦ తమిళులమేనన్న వారున్నారు. తెలుగు వారని చెప్పుకుంటే ఉద్యోగావకాశాలు కోల్పోతామని భయపడుతున్నా మన్న వారూ ఉన్నారు. మేము తెలుగు వాళ్ల౦ అని సగర్వ౦గా ప్రకటి౦చి తమిళ అసెంబ్లీలో తెలుగులోనే మాట్లాడిన హోసూరు ఎం ఎల్ ఏ గోపీనాథ్ లాంటివారూ ఉన్నారు. గోపీనాథ్ అడిగిన ప్రశ్నకు తెలుగులోనే సమాధానం చెప్పిన ముఖ్యమంత్రి జయలలితలూ ఉన్నారు. వెరసి, తమిళ నేల మీద తెలుగు చిరుదీపంలా రెపరెపలాడుతోంది. చెన్నై, తంజావూరు, మదురై, సేలం, తిరుచిరాపల్లి, కోయింబత్తూరు, హోసూరు, రాజపాళ్య౦... ఇలా తమిళ నేల మీద ‘తెలుగు మనసు’ పరచుకున్న ప్రాంతాలు ఎన్నో...! ఇంకా అక్కడ తెలుగు ఉంది. కొన్ని చోట్ల తెలుగే ఉంది.

శ్రీ మండలి బుద్ధప్రసాద్ నాయకత్వంలో ఒక పరిశీలక బృందం 2013 నవంబరు 5,6 తేదీలలో తమిళనాడులో తెలుగు స్థితి గతుల అధ్యయనం కోసం తంజావూరు సందర్శించాము. రాష్ట్ర ప్రాచ్యలిఖిత భాండాగారం పూర్వ సంచాలకులు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యం, సిలికానా౦ధ్ర సంస్థ వ్యవస్థాపకులు శ్రీ కూచిభొట్ల ఆనంద్, మద్రాసు ఆకాశవాణి తెలుగు కార్యక్రమాల నిర్వాహకుడు శ్రీ నాగసూరి వేణుగోపాల్, సీనియర్ పాత్రికేయులు శ్రీ జి ఎల్ ఎన్ మూర్తి, శ్రీ ఆర్ రవిశర్మ, శ్రీ కిలారు ముద్దుకృష్ణ,  పరిశోధకులు డా జి వి పూర్ణచందు, తెలుగు విశ్వవిద్యాలయ పరిశోధకులు డా. సుధారాణి, తమిళ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ తెలుగు విభాగానికి చెందిన డా చిప్పాడ సావిత్రి, ఇంకా మద్రాసు నుండి వివిధ పత్రికలు, చానళ్ల ప్రతినిధులూ ఈ బృందంలో ఉన్నారు.

తంజావూరు తమిళ విశ్వవిద్యాలయం, తంజావూరు సరస్వతీ గ్రంథాలయం, అక్కడికి దగ్గరగా ఉన్న మేలట్టూరు లోని  కూచిపూడి శైలి నాట్య కళాకారులతో ముఖాముఖి, తిరువైయార్ లోని త్యాగరాజ స్వామి వారి సమాధి సందర్శన ఈ పర్యటనలో ముఖ్యమైన అంశాలు.

అక్కడేం జరుగుతోంది...?

          తమిళ భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం తమిళనాడులో ఏం జరుగుతోందనేది అధ్యయనం అవసరమే! అంకితభావంతో పనిచేస్తున్న తమిళ విశ్వవిద్యాలయమే అందుకు సాక్షి. అప్పటి ముఖ్యమంత్రి ఎం జి రామచంద్రన్ మదురైలో జరిగిన ఐదవ ప్రపంచ తమిళ మహాసభల్లో చేసిన ప్రకటన మేరకు 1981లో తమిళ విశ్వవిద్యాలయం ఏర్పడింది. ‘ఉళ్ళువతెల్లం ఉయరావుల్లై...’ అనుకూల తత్వంతో అత్యున్నత అంశాలను ఆలోచించటం... ఈ విశ్వవిద్యాలయం ప్రధాన ధ్యేయం.

అనుబంధ కళాశాలలు లేకుండా, విద్యాపరమైన అంశాలతో నిత్తం లేకుండా కేవలం అత్యున్నత స్థాయి పరిశోధనలు జరపటమే లక్ష్యంగా తొలుత ఈ విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది. పదేళ్లపాటు పరిశోధనలకే పరిమిత మైంది.

1992 తరువాత ఎంఫిల్. పిహెచ్ డి పరిశోధనల ప్రదానం ప్రారంభించింది. 2002లో సాహిత్య సా౦స్కృతిక సామాజిక రంగాలకు సంబంధి౦చి కొన్ని పీజీ కోర్సులను ప్రారంభించారు. 2005లో సైన్సు కోర్సులు కూడా ప్రారంభించారు. ఇందులో సిద్ధ ఆయుర్వేద నౌకాయాన శాస్త్రం లాంటి ప్రాచీన తమిళ శాస్త్రాల అధ్యయనం జరుగుతుంది. మొత్తంమీద తమిళ భాషా సంస్కృతుల గురించి ఉన్నత స్థాయి అధ్యయనం, పరిశోధనలను పెంపొంది౦చటం లక్ష్యంగా ఇది పనిచేస్తోంది.

తమిళసాహిత్యం, సంగీతం, నాటకం, ప్రాచీన వ్రాతప్రతులు, పురావస్తు పరిశోధనలు, ఇతర దేశాలలో తమిళభాష పైన అధ్యయనం, ప్రాచీన తమిళ వైఙ్ఞానిక శాస్త్రాలు, తమిళ లెక్సికానుని ఆధునీకరించటం లాంటి 32 విభాగాలు ఈ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నాయి.

లక్షా యాబైవేల గ్రంథాలున్న పెద్ద గ్రంథాలయం ఈ విశ్వవిద్యాలయానికి అదనపు శోభనిస్తోంది. అందులో అనేక తెలుగు గ్రంథాలు కూడా ఉన్నాయి. దాదాపు 5,000 తాళపత్ర గ్రంథాలను ఈ విశ్వవిద్యాలయంలో భద్రపరచారు.

1925లో తంజావూరులో సమావేశమైన కొందరు తమిళ మేథావులు తమిళ భాషా సంస్కృతుల అభివృద్ధికి ఒక విశ్వవిద్యాలయం ఉండాలని చేసిన ప్రతిపాదనకు 1981లో కార్యరూపం దాల్చి ఈ విశ్వవిద్యాలయం ఏర్పడింది. అప్పటి దాకా మద్రాసులో నివసి౦చి తమిళ భాషా సంస్కృతులకోసం అక్కడ జరుగుతున్న కృషిని ఆకళి౦పు చేసుకున్న యన్టీ రామారావు, ఆ౦ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగానే, తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధిపైన దృష్టి కే౦ద్రీకరించారు. ఈ తమిళ విశ్వవిద్యాలయం ప్రేరణతో 1985 డిసె౦బరు2న ఆయన తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పరచారు. అందుకోసం సాహిత్య, సంగీత, నాటక, నృత్య,  లలితకళా అకాడెమీలను రద్దు చేసి వాటి స్థానంలో వాటి లక్ష్యాలను మరింత సమర్థవంతంగా నిర్వహించే తపనతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభింప చేశారాయన. అంతర్జాతీయ తెలుగు సంస్థను, తెలుగు భాషా సమితినికూడా ఇందులో విలీనం చేశారు. కానీ, ఆచరణలో మనం అనుసరించదగిన, అనుసరించవలసిన అంశాలు చాలా ఉన్నాయి.                     

తంజావూరు, తిరుచిరాపల్లిని కలుపుతూ యాబై కిలోమీటర్ల రహదారి ఉంది. బహుశా, మధుర, తంజావూరు నాయకరాజుల కాలంలోఈ మార్గం ఆ నాడు రణస్థలి అయి ఉంటుంది. ఈ మార్గంలో తంజావూరుకు ఏడు కి.మీ.ల దూరంలో 900 ఎకరాల విశాలమైన అడవులో ప్రకృతి సోయగాల నడుమ తమిళ విశ్వవిద్యాలయం ఉంది.

ఇక్కడే మనం సంతోషంగా చెప్పుకోవలసిన అంశం ఒకటుంది.  ఈ విశ్వ విద్యాలయ చాన్సలర్, ఆ రాష్ట్ర గవర్నర్ మన మాజీ ముఖ్యమంత్రి డా కొణిజేటి రోశయ్యగారు, వైస్ చాన్సలర్ ఆచార్య ఎమ్. తిరుమలై, రిజిష్ట్రార్            డా. గణేష్‘రామ్ ముగ్గురూ తెలుగువారే!

డా. ఎమ్. తిరుమలై 2012నుండీ వైస్-చాన్సలర్ ఉన్నారు. ఆయన మదురై కామరాజు విశ్వవిద్యాలయం నుండీ తమిళభాషలో పిహెచ్.డీ పట్టా పొందారు. డా ఎన్ జెయరామన్ గారి శిష్యులాయన. ఉన్నత ప్రమాణాలను, నూతన విధానాలనూ ప్రవేశపెట్టిన విద్యావేత్తగా ఆయనను తమిళ ప్రభుత్వం గౌరవించింది. ఆయన వైస్ చాన్సలర్ పదవికి వచ్చిన కొత్తల్లో కులసఘాల ప్రమేయంతో కొన్ని నియామకాలను చేయాలని వత్తిడి వచ్చినప్పుడు నిరసనగా తన వైస్ చాన్సలర్  పదవికి రాజీనామా సిద్ధపడటం ద్వారా తన పట్టు నిరూపించుకున్నారు. 

విద్యార్థుల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ ఆయన పట్ల అభిమానం నెలకొని ఉండటంతో అనేక రంగాలలో తమిళ విశ్వవిద్యాలయ పరిధిని ఆయన పెంచుకొంటూ వెడుతున్నారు. రిజిష్ట్రార్ ఆచార్య గణేష్‘రామ్ చరిత్ర పరిశోధనలో పి హెచ్ డి పొందారు. ఆయన కూడా తెలుగు మూలాలనుండి వచ్చినవారే! ఇద్దరూ చక్కని తెలుగు మాట్లాడు తున్నారు. ఆ ఇద్దరు తెలుగు వారి పూనికతో తమిళ విశ్వవిద్యాలయం ఇతర విశ్వవిద్యాలయాలకు తలమానికం అవుతోంది.

విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన మా బృందానికి విశ్వవిద్యాలయ శాఖాధిపతులను ఇతర ఆచార్యులను పరిచయం చేసే కార్యక్రమాన్ని రిజిష్ట్రారు నిర్వహించారు, 

ఈ సమావేశంలో  వైస్‘చాన్సలర్ మాట్లాడుతూ, ఐదు కోట్ల రూపాయల మూలధనం గనక ఆ౦ధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినట్లైతే తమిళ విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం ఏర్పరచి భాషా, సాహిత్య పరమైన తులనాత్మక అధ్యయనంతోపాటు, తమిళనాడులో వివిధ స్థాయిలలో జీవిస్తున్న తెలుగుప్రజల స్థిత గతులపైన సామాజిక జీవనం పైన అధ్యయనాలు జరపటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

నిజానికి అన్ని కే౦ద్రీయ విశ్వవిద్యాలయాలయాలలోనూ తప్పనిసరిగా ఒక తెలుగు పీఠం ఏర్పడవలసిన అవసరం ఉంది. ప్రాచీన భాషగా గుర్తి౦పునొ౦దిన భాషలకు కేటాయించిన నిధులతో తమిళ, కన్నడ, మరాఠా ప్రాంతాలలోని విశ్వవిద్యాలయాలలో తెలుగు పీఠాలను ఏర్పరిచేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం దృష్టి సారించవలసిన అవసరం ఉంది.  

శ్రీ మండలి బుద్ధప్రసాదు తరతరాలుగా తమిళ తెలుగు ప్రజల సాన్నిహిత్యాన్ని, సహజీవనాన్ని చాటి చెప్పే అనేక చారిత్రక ఘటనలను విశదీకరించారు. అప్పయ్య దీక్షితులు ఆ౦ధ్రత్వం అనేది ఎన్నో జన్మల పుణ్య ఫలంగా చెప్పిన విషయాన్నీ, సు౦దరతెలుగని సుబ్రహ్మణ్య భారతి వర్ణించటాన్ని ఆయన ప్రస్తావించారు. తంజావూరు నాయక రాజులకాలంలోనూ ఆ తరువాత మరాఠా రాజులకాలంలోనూ తెలుగు నేలపైన ఒక్క తెలుగు ప్రభుత్వం కూడా లేని కాలంలో తంజావూరు తెలుగు వారి సా౦స్కృతిక వికాసానికి చిరునామాగా మారిందన్నారు. తెలుగు తమిళ భాషా సాహిత్యాల మధ్య తులనాత్మక అధ్యయనం జరగవలసిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. భారతీయ భాషా విభాగాలకు చెందిన అసిస్టె౦ట్ ప్రొఫెసర్ డా చిప్పాడ సావిత్రి సమన్వయకర్తగా వ్యవహరించారు.

మా బృందానికి తమిళ విశ్వవిద్యాలయం ఇచ్చిన ఆతిధ్య౦ మరువలేనిది. రె౦డురోజులపాటు ఫ్యాకల్టీ అతిథి గృహంలో మాకు బస ఏర్పాటు చేశారు.ఉదయం పూట ఉపాహారాలు తమిళ సా౦ప్రదాయంలో కమ్మగా తయారు చేయించారు. వైస్ చాన్సలర్, రిజిష్ట్రార్ లిద్దరూ దగ్గరుండి మర్యాదలు చూసుకున్నారు.

తమిళ విశ్వవిద్యాలయ ఆచార్యులలో చాలామంది మాతో తెలుగులోనే మాట్లాడారు. అక్కడున్నంత సేపూ ఇంగ్లీషు అవసరం మాకు పెద్దగా రాలేదు.

ఆచార్య బి ఎస్ చంద్రబాబు చరిత్ర పరిశోధకులు. వారు రాజపాళ్యం నుండి ప్రత్యేకంగా వచ్చి మమ్మల్ని కలుసుకొన్నారు. తడ దగ్గర ఒక పల్లెటూరులో తెలుగు కుటుంబం ఆయనది. కొన్ని తరాలకు ముందు తమిళనాడు తరలి వెళ్లారు. కనీసం 200 ఏళ్ల పాటు తమిళ ప్రజలు, సర్కార్, రాయలసీమ ప్రజలు ఒకే రాష్ట్రంలో నివసి౦చిన కారణ౦గా నాటి మద్రాస్ ప్రావిన్స్ అంతా వ్యాపించిన తెలుగు వారు ఆయా ప్రాంతాలకు తరలి వెళ్ళిన వారో శరణు కోరినావారో, ఆశ్రితులో కారు కదా! ఆచార్య చంద్రబాబు తమిళ నేలపైన తెలుగు వారి చారిత్రక పాత్ర గురించి చాలా విషయాలు వివరించారు. తమిళ విశ్వవిద్యాలయం నుండి సరస్వతీ గ్రంథాలయానికి చేరుకున్నాం. పరిశోధకులకు తంజావూరు సరస్వతీ గ్రంథాలయం పేరు చెపితే, శరీరం పులకరిస్తుంది. ఈ గ్రంథాలయ విశేషాలు చెప్పుకోదగినవి ఇంకా చాలా ఉన్నాయి

డా. జి వి పూర్ణచందు

Post a Comment

0Comments

Post a Comment (0)